DK Shivakumar: బీజేపీ నేత, అరెస్ట్ చేయబడిని దేవరాజగౌడ కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కుమారస్వామి, బీజేపీని కించపరిచేలా మాట్లాడాలని, వారి పరువు తీయాలని తనకు రూ.100 కోట్లు ఆఫర్ చేసినట్లు శుక్రారం ఆరోపించారు. శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపే సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శివకుమార్ తనకు రూ. 5 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ‘‘నేను ఈ ఆఫర్ తిరస్కరించాను. ఆ తర్వాత నాపై పోలీస్ కేసు నమోదు చేశారు. నన్ను అరెస్ట్ చేశారు. నేను విడుదలైన తర్వాత డీకే శివకుమార్ గురించి అన్ని విషయాలు బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది’’ అని ఆయన పేర్కొన్నాడు.
Read Also: Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో భారత, పాకిస్తాన్ విద్యార్థులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి..?
దేవరాజ గౌడ మాట్లాడుతూ.. ‘‘ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణల సెక్స్ వీడియోలు కలిగిన పెన్‌డ్రైవ్‌ని కుమారస్వామి సర్య్కులేట్ చేశారని నన్ను చెప్పమన్నారు. అయితే, ఆ పెన్‌డ్రైవ్‌ని ప్రజ్వల్ డ్రైవర్ కార్తీక్ గౌడ నుంచి డీకే శివకుమార్ పొందారు. ఆ తర్వాత ఆయన ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశారు’’ అని అన్నారు. సెక్స్ వీడియోలకు సంబంధించిన పరిణామాలను నిర్వహించడానికి ఎన్ చెలువరాయస్వామి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే సహా నలుగురు మంత్రులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు దేవరాజేగౌడ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కుమారస్వామి, బీజేపీకి చెడ్డపేరు తెచ్చేలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్లాన్ చేసిందని, రూ. 100 కోట్లు ఆఫర్ చేసి రూ. 5 కోట్లను అడ్వాన్సుగా బౌరింగ్ క్లబ్‌లోని రూం నం. 110కి పంపారని, ఈ డీల్ కోసం చన్నరాయపట్నంకి చెందిన ఓ స్థానిక నేత గోపాలస్వామిని చర్చించేందుకు పంపారని దేవరాజగౌడ ఆరోపించారు.
సెక్స్ స్కాండల్ అడ్డం పెట్టుకుని ప్రధాని మోడీ పేరును దిగజార్చేందుకు డీకే శివకుమార్ రూ. 100 కోట్ల ఆఫర్ చేయడమే కాకుండా, కుమారస్వామిని రాజకీయంగా అంతం చేయడమే అతని లక్ష్యమని ఆరోపించాడు. నేను ఈ ప్రణాళికలో భాగం కానందునే నాపై అట్రాసిటీ కేసు పెట్టించారని, నన్ను లైంగిక వేధింపుల కేసులో ఫిక్స్ చేశారని ఆయన చెప్పారు. నాపై ఎలాంటి ఆధారాలను కనుక్కులేకపోయారని చెప్పారు. శివకుమార్‌తో మాట్లాడిని ఆడియోటేపులు తన వద్ద ఉన్నాయని, నేను వాటి విడుదల చేస్తానని, జైలు నుంచి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ పెన్‌డ్రైవ్ విడుదలలో శివకుమార్ హస్తం ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన టార్గెట్ ప్రధాని మోడీయేనని చెప్పారు. ఈ కేసును విచారణ జరుపుతున్న సిట్‌పై తనకు నమ్మకంలేదని సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులు, అట్రాసిటీ కేసులో దేవరాజేగౌడను కర్ణాటక పోలీసులు ఆరు రోజుల క్రితం అరెస్టు చేశారు.