ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఉపసంహరణను మరింత వేగం చేయాలని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు సమావేశం అయిన కేంద్ర క్యాబినెట్ మహారత్న,నవరత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో పాటు మైనారిటీ భాగస్వామ్యాలను అమ్మాలని నిర్ణయం తీసుకుంది.
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా నిర్ణయ అధికారాన్ని ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టుబెడుతూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సబ్సిడరీ సంస్థల మూసివేత, ఉమ్మడి నిర్వహణ సంస్థల యంత్రాంగం మార్పు అధికారం డైరెక్టర్లకు అప్పగించింది. వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని నిర్ణయించింది. స్వతంత్రంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు డైరెక్టర్లకు అధికారం కల్పించింది.
వీటితో పాటు ఫ్యూయల్ పాలసీలో పలు మార్పులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. పాలసీలో కొత్తగా ఫీడ్ స్టాక్ అనుమతి ఇచ్చింది. 2030 కల్లా పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపేందుకు అనుమతి ఇచ్చింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ లో మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద బయో ఫ్యూయల్ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను వ్యతిరేఖిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పని వ్యాపారం చేయడం కాదని… గతంలో బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేసింది. ఎల్ఐసీ లో కూడా త్వరలోనే పెట్టుబడులను ఉపసంహరించుకోనుంది.