Site icon NTV Telugu

Kshatriya: “క్షత్రియుల” ఆగ్రహం ఉత్తర భారతంలో బీజేపీని దెబ్బతీసిందా..?

Kshatriya Anger

Kshatriya Anger

Kshatriya: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ సీట్లను సాధించింది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ వరసగా మూడో సారి ప్రధాని పదవిని అధిష్టించబోతున్నారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి 292 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ సొంతగా 240 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. 2014, 2019లో సొంతగా, అంటే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లకు పైగా సాధించింది. అయితే, ఈ సారి మాత్రం 240కి మాత్రమే పరిమితమై, అధికారం కోసం తెలుగుదేశం, జేడీయూ పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది.

అయితే, ఉత్తర భారతదేశంలో తిరుగులేకుండా ఉన్న బీజేపీని క్షత్రియ కమ్యూనిటీ అసమ్మతి కొంపముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్షత్రియ సామాజిక వర్గంలోని ఆగ్రహం వల్లే బీజేపీ సొంతగా మెజారిటీ సాధించలేదని తెలుస్తోంది. బీజేపీ నాయకుడు పురుషోత్తమ్ రూపాల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ కమ్యూనిటీలో ఆగ్రహావేశాలకు కారణమైంది. క్షత్రియుల చరిత్రను వక్రీకరించడంతో పాలటు అగ్నివీర్ పథకం, ఇతర కీలకమైన సమస్యలు కూడా బీజేపీ తక్కువ సీట్లు సాధించేందుకు కారణమైంది. ఎన్నికల ముందు ఈ వర్గం దేశవ్యాప్తంగా మహాపంచాయత్‌ నిర్వహించి, బీజేపీకి వ్యతిరేకం తీర్మానాలు చేశాయి.

దార్‌ సామాజిక వర్గానికి చెందిన రుపాలా మార్చి 22న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్వపు మహారాజులు.. బ్రిటిష్‌ వారితో సహా విదేశి పాలకుల అణచివేతకు లొంగిపోయారు. అదీకాక.. వారితో కలిసి భోజనం చేసి మహారాజులు తమ కుమర్తెలను విదేశీయులకు ఇచ్చి వివాహం జరిపించారని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై రాజ్‌పుత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. అయితే, తన వ్యాఖ్యలకు రూపాల పలుమార్లు క్షమాపణలు చెప్పినా కూడా క్షత్రియుల ఆగ్రహం తగ్గలేదు.

Read Also: Germany floods: జర్మనీని ముంచెత్తిన భారీ వరదలు.. ఐదుగురు మృతి

అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రూపాలా మాత్రం బనస్కాంత స్థానం నుంచి గెలుపొందారు. క్షత్రియుల ఆందోళనలు జరిగిన రాజస్థాన్‌లోని ఏడు చోట్ల బీజేపీ ఓడిపోయింది. చరిత్రను వక్రీకరిస్తూ వ్యాఖ్యలు చేయడంతో పాటు రాజ్‌పుత్ వర్గాలకు సరైన సీట్లు ఇవ్వకపోవడం, రాజ్‌పుత్‌లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే శుభకరన్ చౌదరి వంటి నాయకులకు టికెట్లు ఇవ్వడం క్షత్రియ కమ్యూనిటీకి నచ్చలేదు. దీంతో ఈ వర్గం బీజేపీ నుంచి దూరమైంది. రాజ్‌పుత్ వర్గాల అభ్యర్థులకు బదులుగా ఇతర ఓబీసీ అభ్యర్థులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది,దీంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిర్ధిష్ట వర్గానికి మాత్రమే కీలక పదువులు ఇవ్వడం, క్షత్రియ వర్గాన్ని బీజేపీకి దూరం చేసింది.

మరోవైపు రూపాల ప్రకటన, క్షత్రియుల చరిత్ర వక్రీకరణ ఆరోపణలు, తొమ్మిదవ శతాబ్ధపు రాజు మిహిర్ భోజ్‌ని గుజ్జర్ కమ్యూనిటీకి ఆపాదించడం, అగ్నివీర్ పథకం, ఈడబ్ల్యూఎస్ పథకం సడలింపులను నిరాకరించడం ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి దారి తీశాయి. యూపీలో 2014లో క్షత్రియ వర్గానికి 21 టికెట్లు ఇవ్వగా, ఇందుల్లో 19 మంది గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కేవలం 10 మందికి మాత్రమే టిక్కెట్లు కేటాయించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version