తమిళనాడులో మరో కొత్త పార్టీ అవతరించబోతుంది. 2029 పార్లమెంట్ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో మరిన్ని నూతన పార్టీలు ఏర్పడే సంకేతాలు వెలువడుతున్నాయి. హీరో విజయ్ కొత్త పార్టీ ఏర్పాటు చేసిన ఏడాదికే తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చింది. ఎవరు ఊహించని విధంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరికొంత మంది హీరోల్లో కూడా ఊపు వచ్చింది. తాజాగా విజయ్ బాటలోనే హీరో ధనుష్ అడుగులు వేస్తున్నారు. అలాగే మరో నటుడు శివకార్తీకేయన్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల అభిమానులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఇక ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై కూడా సరికొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే పార్టీ పేరు ప్రకటించవచ్చు. ఇలా ద్రవిడ రాష్ట్రంలో కొత్త పార్టీల సందడి కొనసాగుతోంది.
ఇక హీరో ధనుష్ గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక నేతలతో మేథోమదనం చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు. రాజకీయ పండితులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాజకీయ వ్యూహకర్తలతోనూ మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ధనుష్ రాజకీయ అరంగేట్రంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ ఏడాది తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయ్ పార్టీ టీవీకే ఘన విజయం సాధించింది. ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలను ఓడించి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి టీవీకే అధికారంలోకి రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

