NTV Telugu Site icon

Devendra Fadnavis: భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” పాల్గొన్నారు.. మహారాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు!

Fadnavis

Fadnavis

Devendra Fadnavis: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగిన భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” సంస్థలు పాల్గొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 15వ తేదీన ఖాట్మండులో జరిగిన రహస్య సమావేశంలో ఈవీఎంలను వ్యతిరేకించడంతో పాటు మహారాష్ట్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లను ప్రవేశ పెట్టడం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారని అసెంబ్లీ సమావేశాల్లో ఆరోపించారు. అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో అశాంతిని ప్రేరేపించడానికి అనేక కుట్రలు చేశారని తెలిపారు. ఇక, ఎన్నికల్లో టెర్రర్ ఫండ్స్ వినియోగంపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేసిన విచారణలో భారత ఎన్నికలలో విదేశీ జోక్యానికి గల ఆధారాలు ఉన్నాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.

Read Also: Paritala Ravi: పరిటాల రవి హత్య కేసు.. బెయిల్‌పై విడుదలైన ఐదుగురు ముద్దాయిలు!

ఇక, కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌లుగా కొనసాగుతున్న 40 సంస్థలు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అలాగే, 2014లో మన్మోహన్ సింగ్ సర్కార్ హయాంలో లోక్‌సభలో 72 ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌ల పేర్లను ప్రస్తావించిందన్నారు. ఇక, వాటిలో 7 సంస్థలు భారత్ జోడో యాత్రలో భాగమేనని పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) కోసం ఈ సంస్థలు ప్రచారం చేశాయన్నారు. అర్బన్ నక్సలిజాన్ని ఎదుర్కోవటానికి మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 2024ని అసెంబ్లీలో మహాయుతి ప్రభుత్వం సమర్పించింది.

Show comments