India-Canada Ties: ఇండియా కెనడా మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా దౌత్య సంబంధాలు దిగజారాయి. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మ, మరికొందరు దౌత్యవేత్తలు ‘‘ఆసక్తి గత వ్యక్తులు’’ అంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కెనడా వ్యవహార శైలిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలోని భారత హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. దీంతో పాటు ఇండియాలోని ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను శనివారంలోగా ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది. నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉన్నట్లు ఇప్పటి వరకు కెనడా ఎలాంటి ఆధారాలను పంచుకోలేదని భారత్ చెప్పింది.
జూన్ 8,2023లో ఖలిస్తానీ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) సంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో గురుద్వారా ముందు కాల్చి చంపారు. దీని తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ఈ ఘటనలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని చెప్పాడు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా వ్యాఖ్యలు ‘‘పూర్తిగా అసంబద్ధమైన ప్రేరేపిత వ్యాఖ్యలు’’గా కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని వ్యాఖ్యానించింది.
అయితే, గతేడాది నుంచి సైలెంట్‌గా ఉన్న కెనడా మరోసారి ఎందుకు భారత్‌ని టార్గెట్ చేసిందంటే..? ఒక్కటే సమాధానం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి అక్కడి సిక్కుల ఓట్లు కావాలి. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఆయన మరోసారి వారిని సంతృప్తి పరిచేందుకు భారత్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్డీపీ నాయకుడు జగ్మీత్ సింగ్, ట్రూడోకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నాడు. దీంతో ప్రభుత్వాన్ని నడపడానికి మరింత మద్దతు కావాలి. మైనారిటీ ప్రభుత్వం అధికారంలో కొనసాగేందుకు సిక్కు ఎంపీల మద్దతు అవసరం.
మరో ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలోని ఏడు లక్షలకు పైగా ఉన్న సిక్కు ఓట్లు చాలా అవసరం. దీంతోనే ట్రూడో తెలివిగా మరోసారి నిజ్జర్ మృతిని ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రూడో పాపులారిటీ రోజు రోజుకు తగ్గిపోతోంది. కెనడాలో ఉద్యోగాలు లేకపోవడం, హౌసింగ్ క్రైసిస్, ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కొంటోంది. వీటిన్నింటి నుంచి ప్రజల దారిని మళ్లించే ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు.
కెనడా ఎంపీ జగ్మీత్ సింగ్ ఖలిస్తానీ మద్దతుదారు. తన వర్గం ఓట్లు, ఎంపీల మద్దతు పొందాలంటే ఖలిస్తాన్ సమస్యని పునరుద్ధరించాలని ఆయన ట్రూడోకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మరోవైపు ట్రూడో తన ప్రధాన ఓటర్లపై పట్టుకోల్పోతున్నాడు. మితవాద ఓటర్లు కూడా ప్రస్తుతం ఆయన వైపు లేరు. కెనడా గ్యాంగ్ స్టర్లు, ఖలిస్తానీ ఉండాలు, నేరస్తులకు ఆశ్రయం, వీసా, ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడానికి కేంద్రంగా మారుతోంది.
దీనికి తోడుగా భారత దౌత్యవేత్తలే టార్గెట్‌గా అక్కడ ఎంసీలపై ఖలిస్తానీ గుండాలు దాడులు చేస్తున్నారు. వీటిపై కెనడా నామమాత్రమైన చర్యలు కూడా తీసుకోవడం లేదు. సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ వంటి ఉగ్రవాదులు బహిరంగంగానే భారత దౌత్యవేత్తలను హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. వీటిన్నింటి కప్పిపుచ్చుకునేందుకు భారత్ తమ విచారణకు సహకరించడం లేదని అక్కడి పోలీసులతో చెప్పిస్తున్నారు. మరోవైపు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో భారత అధికారులకు సంబంధాలు ఉన్నాయని తలాతోక లేని వాదనల్ని కెనడా ఎత్తుకుంటోంది.