Demolition of encroachments in Bengaluru: ఇండియన్ సిలికాన్ సిటీగా పేరు తెచ్చుకున్న బెంగళూరులో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆక్రమణల కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల బెంగళూర్ నగరం వరదల్లో చిక్కుకుంది. తాజాగా వరద కాల్వలను ఆక్రమించుకుని మరీ నిర్మించిన భారీ భవనాలు, అపార్ట్‌మెంట్ల బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తొలగిస్తోన్నారు. దీనికోసం 60కి పైగా బుల్‌డోజర్లు, జేసీబీలను వినియోగిస్తోన్నారు. ఇదివరకు నోటీసులు ఇచ్చిన తరువాత కూడా స్పందించని భవనాలను కూడా నేలమట్టం చేస్తోన్నారు.
ఇటీవల కురిసిన అతి భారీ వర్షం దెబ్బ నుంచి సిలికాన్ సిటీ బెంగళూరు సగం మునిగిన విషయం తెలిసిందే. ప్రధాన ప్రాంతాలు, టెక్ పార్కులు చెరువులను తలపించాయి. ఆయా ప్రాంతాల్లో మూడురోజుల వరకు వర్షపునీరు నిలిచివుందంటే వర్షాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన మార్గాల్లో రెండు నుంచి మూడడుగుల మేర వర్షపునీరు నిలిచిపోయింది. స్కూటర్లు, కార్లు రోడ్లపై రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా చాలామంది ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లడానికి ట్రాక్టర్లను ఆశ్రయించారు.
Read Also: West Bengal: రణరంగంగా బెంగాల్.. మమతాబెనర్జీ “లేడీ కిమ్” అంటూ విమర్శలు
యామలూరు, బెల్లందూరు, సర్జాపుర, వైట్‌ఫీల్డ్, బన్నేరుఘట్ట రోడ్, బసవేశ్వర నగర, యశ్వంతపూర్, పీణ్య, లగ్గెరె, విజయనగర, రాజాజీనగర, మల్లేశ్వరం, శేషాద్రిపురం, మల్లేశ్వరం, మార్థహళ్లి, ఎలక్ట్రానిక్ సిటీ, మాన్యత టెక్ పార్క్ .. ఇలా దాదాపు అన్ని ప్రాంతాలూ జలమయం అయ్యాయి. వర్షం కారణంగా 225 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఐటీ కంపెనీల యజమానులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. ఫ్లైఓవర్లు, మెట్రో లైన్లు నిర్మాణంలో ఉన్న రహదారుల్లో రాకపోకలు సాగించే వాహనదారులు నరకాన్ని చవి చూశారు.
పరిస్థితులు తలెత్తడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలను కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే బీబీఎంపీ అధికారులు బుల్‌డోజర్లు, జేసీబీలతో రంగంలోకి దిగారు. భారీ అపార్ట్‌మెంట్లను సైతం వదల్లేదు. అక్రమ కట్టడాలుగా గుర్తించిన వాటన్నింటినీ కూల్చివేసే పనులను అయిదారు రోజులుగా నిరంతరాయంగా కొనసాగిస్తోన్నారు.
Read Also: Nikhil: మొన్న తారక్.. నేడు నిఖిల్.. అమిత్ షా వ్యూహం అదే..?
మురుగునీరు, వరదనీటి అనుసంధానిస్తూ నిర్మించిన రాజ కాలువలపై ఆక్రమణలను తొలగిస్తోన్నారు. రాజ కాలువలు ఆక్రమణలకు గురి కావడం వల్ల మురుగు, వరదనీరు రోడ్లపై పోటెత్తిందని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ స్పష్టం చేశారు. మహదేవపుర ప్రాంతంలో కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగులను తొలగిస్తోన్నారు. వాటిని గుర్తించడానికి ప్రత్యేకంగా సర్వే నిర్వహించామని మహదేవపుర జోన్ బీబీఎంపీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాఘవేంద్ర తెలిపారు.
మహదేవపుర జోన్ పరిధిలోని చళ్లఘట్ట, చిన్నప్పనహళ్లి, బసవననగర్, ఎస్ఆర్ లే అవుట్, బసవనపుర వార్డ్‌లల్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాగ్‌మనె టెక్‌పార్క్, పూర్వ ప్యారడైజ్, రెయిన్‌బో డ్రైవ్, దొడ్డకనెళ్లిలోని విప్రో, ఆర్ఎంజెడ్ ఎకోస్పేస్, గోపాలన్ ఎంటర్‌ప్రైజెస్, దియా స్కూల్, రామగొండనహళ్లిలోని కొలంబియా ఏసియా ఆసుపత్రి, న్యూ హారిజాన్ కాలేజ్, ఆదర్శ్ డెవలపర్స్, ఎప్సిలాన్, దివ్యశ్రీ 77, ప్రెస్టీజ్ గ్రూప్, సాలార్‌పురియా గ్రూప్, నలపాడ్ వంటి ప్రతిష్ఠాత్మక భవనాలను బీబీఎంపీ అధికారులు అక్రమ కట్టడాలుగా గుర్తించారు.
