Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్‌కు కారణమైన ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని అనంత్‌నాగ్ మెడికల్ కాలేజీ(జీఎంసీ)లో పనిచేస్తున్నప్పుడు అతడి విపరీత ప్రవర్తనను గురించి సిబ్బంది గుర్తు చేసుకున్నారు. అతను వైద్యం కోసం వచ్చిన మహిళా రోగులతో ప్రవర్తించిన తీరు గురించి చెబుతున్నారు. ఆత్మాహుతి బాంబర్‌గా మారిన ఉమర్, ఢిల్లీ ఉగ్రదాడితో 13 మందిని బలి తీసుకున్నాడు. అయితే, అతను ఎలా రాడికలైజ్డ్ అయ్యాడనే కోణంలో కూడా ఏజెన్సీలు వివరాలు రాబడుతున్నాయి.
తరుచుగా అతను మహిళా రోగులతో సమస్యాత్మకంగా వ్యవహరించేవాడని, హిజాబ్ ధరించకపోవడంపై ప్రశ్నించే వాడని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ‘‘ అతను మహిళా రోగులతో మాట్లాడుతూ.. మీరు హిజాబ్ ఎందుకు ధరించలేదు.? మీ తలను ఎందుకు సరిగ్గా కప్పుకోలేదు’’ అని అడగటం విన్నామని అక్కడ పనిచేస్తున్న వారు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కాకుండా మీరు ఎన్ని సార్లు నమాజ్ చేస్తారని ప్రశ్నించే వాడని, మత విశ్వాసాలను పట్టించుకోకపోతే వారిని శత్రువులుగా చూసేవాడని తెలిసింది.
ఉమర్ అత్యంత తీవ్రవాద మనస్తత్వాన్ని కలిగి ఉండే వాడని, అతను ఇతర విశ్వాసాలపై ఇస్లామిక్ ఆధిపత్యాన్ని ప్రోత్సహించాలని కోరుకునే వారని అక్కడ ఉన్న వారు అధికారులకు చెప్పారు. క్లాస్ రూంలో పురుష, స్త్రీ విద్యార్థులను వేరు చేయాలని కూడా పిలుపునిచ్చాడని, కొంత మంది రోగులు అతని ప్రశ్నలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో చివరకు రోగులు జీఎంసీ అనంత్‌నాగ్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.
ఇది జరిగిన తర్వాత, అతను హర్యానా ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. నవంబర్ 10న జరిగిన ఆత్మాహుతి బాంబ్ దాడికి ముందు అతను ఓ వీడియో రికార్డ్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. జమ్మూ కాశ్మీర్ లోని నబీ సోదరుడికి ఇచ్చిన ఫోన్‌లో ఈ క్లిప్ సేవ్ చేసి ఉంది.
