Site icon NTV Telugu

Pollution: 12 ఏళ్ల ఆయుర్దాయం ఖతం.. ఢిల్లీ వాసులకు పొంచి ఉన్న ప్రమాదం..

Delhi Air Pollution

Delhi Air Pollution

Pollution: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ఈ కాలుష్యం రానున్న కాలంలో ఢిల్లీ వాసులపై పెను ప్రమాదాన్ని మోపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. దేశ రాజధాని ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉందని, ప్రస్తుతం కాలుష్య స్థాయిలో ఇలాగే కొనసాగితే ఢిల్లీ నివాసితులు తమ 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే అవకాశం ఉందని తేలింది.

భారతదేశంలోని 1.3 బిలియన్ల ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్ధేశించిన కాలుష్య పరిమితిని దాటిన ప్రాంతాల్లోని నివసిస్తున్నారని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) వెల్లడించింది. దేశంలో 67.4 శాతం మంది ప్రజలు జాతీయ వాయునాణ్యత 40 μg/m3ని మించిన ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తెలిపింది.

Read Also: Central Cabinet: చంద్రయాన్-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం

ఫైన్ పార్టికల్ ఎయిర్ పొల్యూషన్(PM2.5) సగటున భారతీయుడి ఆయుర్దాయాన్ని 5.3 ఏళ్లు తగ్గిస్తుందని అధ్యయనం తేల్చింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంలో ఢిల్లీ ఉందని, నగరంలోని 18 మిలియన్ల నివాసితులు సగటున 11.9 ఏళ్ల ఆయుర్థాయాన్ని కోల్పోతున్నారని, ప్రస్తుత కాలుష్య స్థాయిలు ఇలాగే కొనసాగితే, జాతీయ సూచీలతో పోల్చితే 8.5 ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోవడానికి అవకాశం ఉందని AQLI తెలిపింది.

ఈ ప్రాంతంలో కాలుష్య గణాంకాలను పరిశీలిస్తే తక్కువ కాలుష్యం ఉన్న జిల్లా పంజాబ్ లోని పఠాన్ కోట్ ఉంది. అయినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ పరిమితిని మించి 7 రెట్లు అధిక కాలుష్యం ఉంది. దీని వల్ల 3.1 సంవత్సరాల ఆయుర్దాయం తగ్గుతుందని నివేదిక తెలిపింది.

Exit mobile version