Site icon NTV Telugu

Cold Wave: చలి గుప్పిట ఢిల్లీ..1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. స్కూళ్లు బంద్..

Cold Wave

Cold Wave

Cold Wave In Delhi: ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఢిల్లీలో 1.9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఇది గడిచిన రెండేళ్లలో జనవరి నెలలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఢిల్లీలోని ప్రైవేట్ స్కూళ్లకు జనవరి 15 వరకు సెలవులను పొడగించింది ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలలు జనవరి 9న పున: ప్రారంభం కావాల్సి ఉన్నా.. చలిగాలుల ప్రభావం వల్ల స్కూళ్లను నెక్ట్ వీక్ వరకు మూసేయాలని సూచించారు అధికారులు.

Read Also: Kerala: కేరళలో మరో ఫుడ్ పాయిజనింగ్ కేసు.. విద్యార్థులు, పేరెంట్స్‌కు అస్వస్థత

ఇదిలావుండగా, రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత కూడా మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పొగమంచు నెలకొని ఉంటుందని వెల్లడించింది. జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర మధ్యప్రదేశ్, బీహార్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలలో వచ్చే 2-3 రోజులలో దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

చలి తీవ్రత వల్ల శనివారం వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తగ్గుతున్న గాలి నాణ్యత, చలిగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాబోయే మూడు నాలుగు రోజులు ఢిల్లీలో వాయునాణ్యత చాలా పూర్ గా ఉంటుందని తెలిపింది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు హిల్ స్టేషన్ల కన్నా తక్కువగా నమోదు అవుతున్నాయి.

Exit mobile version