Delhi Police: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీనామా కోరుతూ ఢిల్లీలో నిరసనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిరసనల్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ‘‘రీల్ మేకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు”కు వర్తించవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కొందరు కెమెరాలు, మైక్రోఫోన్లు పట్టుకుని యూట్యూబ్ రీల్స్ రూపొందించే కంటెంట్ క్రియేటర్లు అని తెలిపారు. దీంతో క్షేత్రస్థాయిలో నిజమైన జర్నలిస్టులు, రీల్ మేకర్స్‌ను గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు కోర్టుకు వెల్లడించారు.
ఇదే సమయంలో కంటెంట్ క్రియేటర్ల కార్యకలాపాలను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, అయితే నిరసన కవర్ చేస్తున్న జర్నలిస్టులకు విధించిన మార్గదర్శకాలు నిజమైన జర్నలిస్టులు, కంటెంట్ క్రియేటర్లను గుర్తించేందుకు ఉద్దేశించినవే అని పోలీసులు చెప్పారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వంటివి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దీనికి సమాధానంగా ఢిల్లీ పోలీసులు కంటెంట్ క్రియేటర్లు జర్నలిస్టులు కాదని అఫిడవిట్ దాఖలు చేశారు.
జర్నలిస్టులకు పోలీసుల గైడ్‌లైన్స్..
ఢిల్లీ నిరసనలు కవర్ చేస్తున్న జర్నలిస్టుల కోసం అక్టోబర్ 5న ఢిల్లీ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. జర్నలిస్టులు తమ సంస్థలు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (DIP) జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులను వెంట ఉంచుకోవాలని ఆ సూచనల్లో పేర్కొన్నారు. గుర్తింపు కార్డులను స్పష్టంగా కనిపించేలా ధరించాలని, పోలీస్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దని, ఉద్రిక్త పరిస్థితుల సమయంలో తగినంత దూరం ఉండాలని సూచించారు.

