Delhi Police: రామ్‌లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!

  • రామ్‌లీలా మైదానంలో సభలకు గరిష్ఠంగా 50 వేల మందికే అనుమతి..
  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే..
  • కార్యక్రమానికి 10 రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి..
  • ఢిల్లీ పోలీసుల ప్రతిపాదనలు..
Ramlila Ground

Ramlila Ground

Delhi Police: ఢిల్లీలో రామ్‌లీలా మైదాన్‌లో సభలు నిర్వహించాలనుకునే వారికి ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇకపై రామ్ లీలా మైదాన్‌లో నిర్వహిచే సభలు, నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించారు. ఈ మూదానంలో జరిగే కార్యక్రమాలకు గరిష్టంగా 50 వేల మందిని మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే సభ నిర్వహించాలని ప్రతిపాధించారు. ఇదే సమయంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి అంశాలపై నిర్వాహకులే బాధ్యత వహించేలా ముసాయిదా కార్యాచరణ విధానాన్ని (SOP) రూపొందించారు. ఈ ముసాయిదా ఆమోదం కోసం ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని, నిబంధలను ఇంకా ఖరారు కావాల్సి ఉందని తెలిపారు.

ప్రతిపాదనల్లో ఏముంది.?

రామ్‌లీలా మైదాన్‌లో కార్యక్రమం నిర్వహించాలనుకునే నిర్వాహకులు ముందుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) నుంచి మైదానం అందుబాటులో ఉందనే అనుమతి పొందాలి. ఆ తర్వాతే పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమానికి 10 రోజలు ముందుగానే దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు.

సభలు, నిరసన కార్యక్రమాలకు వచ్చే ప్రజల నిర్వహణ బాధ్యతలను నిర్వాహకులపైనే ఉంచేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఇందులో ట్రాఫిక్ కోఆర్డినేషన్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సభకు వచ్చే ప్రజల్ని నిర్వహించడం వంటి బాధ్యతల్ని నిర్వాహకులే నిర్వహించాల్సి ఉంటుంది. రహదారులు, అత్యవసర సేవల వాహనాలు వెళ్లే మార్గాలకు అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. తాగునీరు, వైద్య సహాయం, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడం, చెత్తను తొలగించే ఏర్పాట్లను కూడా నిర్వాహకులే చూసుకోవాలి.

ఇదే సమయంలో సభకు వచ్చే వారు తుపాకులు, కత్తులు, ఖడ్గాలు, ఈటెలు, పదునైన వస్తువులు, ఇతన నిషేధిత సామాగ్రిని తీసుకురాకుండా చర్యల్ని ప్రతిపాదించారు. రామ్ లీలా మైదాన పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు.