Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..

  • ఢిల్లీలో రేపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసన..
  • అనుమతి కోరలేదంటున్న పోలీసులు..
  • అనుమతి ఇవ్వలేదంటున్న సీజేపీ..
  • ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్..
Cockroach Janta Party

Cockroach Janta Party

Cockroach Janta Party: సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ జూన్ 6న ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శనను ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపడుతామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ ప్రకటన ఇప్పటికే వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి అధికారికంగా అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు అందలేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రేపు నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనపై సోషల్ మీడియా ప్రచారంపై పోలీసులు కన్నేసి ఉంచారు. ఢిల్లీ పోలీసులు ప్రకారం.. జంతర్ మంతర్ వద్ద ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. దరఖాస్తు అందితే భద్రతా పరిస్థితులు, పరిపాలనా అంశాలు, ప్రజా శాంతి భద్రతల దృష్ట్యా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

×
×
Ad

సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని తెలిపారు. మరోవైపు తాము దరఖాస్తు చేసుకున్నామని పోలీసులు అనుమతి ఇవ్వలేదని సీజేపీ ప్రతినిధులు చెబుతున్నారు. నీట్ పేపర్ లీక్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది.