Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..

Delhi Police

Delhi Police

Delhi Police: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో చట్టవ్యవస్థను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని స్థాయిల పోలీసు సిబ్బందికి సాధారణ సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నగరవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అధికారిక ఉత్తర్వుల ప్రకారం క్యాజువల్ లీవ్, ఎర్న్డ్ లీవ్ సహా ఎలాంటి సాధారణ సెలవులు కూడా మంజూరు చేయరు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత ఉన్నతాధికారుల అనుమతితో సెలవులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)లు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

శిక్షణా కార్యక్రమాలపైనా ఆంక్షలు
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ ప్రత్యేక అనుమతి లేకుండా ఎలాంటి పోలీసు సిబ్బంది శిక్షణా కార్యక్రమాలకు హాజరు కావద్దని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీలైనంత ఎక్కువ మంది సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో జనసమూహ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

పోలీసులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు
ఆందోళనల సమయంలో పోలీసులపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను గుర్తించే ప్రక్రియను ఢిల్లీ పోలీసులు ప్రారంభించినట్లు సమాచారం. పోలీసు సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే విద్యార్థుల అభిప్రాయాలను వినేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆందోళనలను ఆసరాగా చేసుకుని హింసకు పాల్పడే సంఘవ్యతిరేక శక్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ పట్టుదల
మరోవైపు కేంద్రం నుంచి హామీలు రావడంతో సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించినప్పటికీ, కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మాత్రం తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాను విరమించబోమని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇక, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురానుందని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు హామీ ఇచ్చారు. ప్రతిపాదిత యాంటీ పేపర్ లీక్ బిల్లు త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనున్నట్లు, ఆమోదం అనంతరం వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధాని పేర్కొన్నారు.