NTV Telugu Site icon

New Delhi: ఢిల్లీలో హై అలర్ట్.. ఐబీ హెచ్చరికలతో భారీ భద్రత

Red Port

Red Port

Delhi On High Alert: దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వేడుకల్లో అశాంతిని సృష్టించేందుకు, అలజడి రేపేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు, దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ జారీ అయింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.

స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో అల్లర్లు, దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. 10 వేల మంది పోలీసులు ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు ఎగరవేయకుండా 400 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఎర్రకోట, ఢిల్లీ పోలీస్ కమాండ్ల చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలపై షార్ప్ షూటర్ల మోహరించారు. గాలిపటాలు, డ్రోన్లు ఎగరవేయకుండా నిషేధం విధించారు. వెయ్యికి పైగా సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేయనున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎలాంటి అపాయాన్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నారు.

Read Also: COVID 19: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోంది. ఇప్పటికే ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా దేశంలో ఉగ్రవాద దాడులు చేసేందుకు లష్కరే తోయిబా, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వీటన్నింటిని ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు, నిఘా విభాగం భగ్నం చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఐసిస్ సంబంధం ఉన్న ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఐసిస్ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారిస్తోంది.