Delhi Lieutenant Governor: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. ఆ పార్టీ నేతలు అతిషి, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, జాస్మిన్ షాలకు నోటీసులు పంపారు. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కోరారు. నోట్ల రద్దు సమయంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా సక్సేనా అవినీతికి పాల్పడ్డారని ఆప్ ఆరోపించింది.
వీకే సక్సేనా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రూ.1,400 కోట్ల విలువైన నిషేధిత కరెన్సీ నోట్లను మార్చారని ఆప్ ఆరోపించింది. వీకే సక్సేనా 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో కుంభకోణానికి పాల్పడ్డారని, ఆయనపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. అయితే సీబీఐ ఇప్పటికే ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి, ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
Manish Sisodia: కేసులో నన్ను ఇరికించమని ఒత్తిడి వల్లే అధికారి ఆత్మహత్య.. తోసిపుచ్చిన సీబీఐ
నోట్ల రద్దు సమయంలో ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ ఖాతాలో రద్దయిన నోట్లు జమ అయిన విషయం తెలియగానే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు ఎల్‌జీ కార్యాలయం గతంలో వెల్లడించింది. నలుగురు ఉద్యోగులను కూడా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సీబీఐ విచారణలో రూ.17.07లక్షల రద్దయిన నోట్లు జమ అయినట్లు తేలిందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపింది. కేవలం రూ.17లక్షలకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రూ.1400కోట్లుగా పేర్కొంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వీకే సక్సేనా దుయ్యబట్టారు. ఇవి కేవలం కల్పిత ఆరోపణలేనని, అబద్దాలకోరులు తప్పకుండా పర్యవసనాలను ఎదుర్కొంటారని గతంలో కూడా హెచ్చరించారు.
మేలో బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్‌ల మధ్య ప్రారంభం నుంచే సంబంధాలు అంతగా లేవు. ఎల్జీ వీకే సక్సేనా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.
