Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లకు సంబంధించి బలవంతపు చర్య నుండి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు నిరాకరించింది. తాను ఈడీ విచారణకు హాజరవుతాను కానీ, తనను అరెస్ట్ చేయబోమని ఈడీ నుంచి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం విచారణకు వెళ్తే ఎలాంటి బలవంతపు చర్యను తీసుకోవద్దని కోర్టు ముందు హామీ ఇవ్వాలని కోరారు. ఈ రోజు పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు, మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి తాము మొగ్గు చూపడం లేదని పేర్కొంది. ఈ మధ్యంతర పిటిషన్‌పై ఈడీ నుంచి ప్రతిస్పందన కోరుతూ.. ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా అడ్డుకోలేం: ఢిల్లీ హైకోర్ట్
అంతకుముందు ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ.. సీఎం కేజ్రీవాల్ ఈడీ దర్యాప్తు ముందు హాజరవుతారు కానీ, ఈడీ ఒక స్వతంత్ర సంస్థ కాదని అది దర్యాప్తు చేయకూడదని భావిస్తున్నాము, ఇది బీజేపీ రాజకీయ సాధనంగా మారిందని విమర్శించారు. ఆయనను విచారణకు పిలిచి అరెస్ట్ చేయాలని ఈడీ భావిస్తోందని, అతడిని అరెస్ట్ చేయమని ఈడీ కోర్టులో హామీ ఇవ్వాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నుంచి కేజ్రీవాల్‌ని దూరం చేయడం ఈడీ లక్ష్యమని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసింది, అయితే ఒక్కదానికి కూడా ఆయన హాజరుకాలేదు.
