‘మీరు Gen Z కాదు’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వయసులపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. జంతర్ మంతర్ దగ్గర నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అభిక్ చిమ్నీ వాదనలు వినిపిస్తూ.. సౌరవ్ దాస్ వయసు 27 ఏళ్లు కాగా.. ఆశుతోష్ రంకా వయసు 32 ఏళ్లని కోర్టుకు తెలిపారు. దీంతో స్పందించిన న్యాయస్థానం.. “అయితే మీరు Gen Z కాదు. అసలు Gen Z అంటే ఏమిటి?” అని వ్యాఖ్యానించినట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది. 1997 తర్వాత జన్మించిన వారిని సాధారణంగా Gen Zగా పరిగణిస్తారని న్యాయవాది వివరించగా.. “అయితే మీరు Gen Z కాదు” అని కోర్టు మరోసారి వ్యాఖ్యానించింది.
జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్ ఈ కేసును విచారించారు. సంబంధిత ఉత్తర్వులను సవాలు చేసేందుకు రివిజన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉండగా.. పిటిషనర్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) అక్టోబర్ 19న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాల న్యాయ నిర్బంధాన్ని అక్టోబర్ 21 వరకు పొడిగించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద ప్రారంభించిన ముందస్తు నిరోధక చర్యల్లో భాగంగా ఈ నిర్బంధం విధించారు. జంతర్ మంతర్ దగ్గర నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఈ వ్యవహారం కొనసాగుతోంది.

