వ్యాపారులు ఇటీవల కొత్త పంథాలో ఆలోచిస్తున్నారు. తమ బిజినెస్ చక్కగా సాగాలనే ఉద్దేశంతో పాపులర్ అయిన పేర్లను షాపులకు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ దూసుకుపోతోంది. ప్రతి మొబైల్‌లో ఫేస్‌బుక్ ఉండాల్సిందే. ఈ మధ్య ఫేస్‌బుక్ లైవ్స్, రీల్స్ కూడా నెటిజన్లు చేసేస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యాపారి ఫేస్‌బుక్ పేరును వాడి లబ్ధి పొందాలని ప్రయత్నించాడు. అచ్చంగా అదే పేరు పెడితే కేసు అవుతుందని భావించి తన బేకరీకి ‘ఫేస్ బేక్’ అని పేరు పెట్టాడు. అయితే చూడగానే ఇది ఫేస్ బుక్ అనిపించేలానే ఉంది. ఈ బేకరీ పేరు ఆ నోట ఈ నోట పడి వైరల్ కావడంతో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా దృష్టికి కూడా వెళ్లింది. మరి మెటా ఊరికే ఉంటుందా.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Read Also:Srilanka Crisis: టీవీ ఛానల్‌లోకి దూసుకెళ్లిన ఆందోళన కారులు.. ప్రత్యక్షప్రసారాలు నిలిపివేత
ఇటీవల మెటా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఫేస్ బుక్ లోగోతో పోలిన ఏ పేరుతోనూ వ్యాపారం చేయకూడదని కోర్టు సదరు వ్యాపారిని హెచ్చరించింది. ఫేస్ బుక్ అన్నది బాగా తెలిసిన ట్రేడ్ మార్క్ అని.. దాని నుంచి లబ్ధి పొందేందుకే ఫేస్ బేక్ అంటూ నౌఫెల్ మలోల్ అనే యజమాని ఈ పేరును ఎంపిక చేసుకున్నాడని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా వ్యాపారికి రూ.50,000 జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫేస్ బుక్, ఫేస్ బేక్ మధ్య వ్యత్యాసం ఉన్నా, చూడ్డానికి ఒకే మాదిరిగా ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా తన తీర్పులో ప్రస్తావించారు.