దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేట్ 2 శాతం దాటగా… వారం రోజుల్లోనే హోం ఐసోలేషన్ కేసులు దాదాపు 48శాతం పెరిగాయి. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువ కేసులు బయటపడుతుండటం గవర్నమెంట్ అప్రమత్తమైంది. ఢిల్లీలో వరుసగా కేసులు పెరుగుతున్నాయి. గురువారం 325 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1న 0.57శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు గురువారానికి 2.39 శాతానికి చేరింది. శుక్రవారం నాడు 366 కొత్త కేసులు నమోదు కాగా… యాక్టివ్ కేసుల సంఖ్య 1072కు పెరిగింది. అదే టైమ్ లో హోం ఐసోలేషన్ కేసులు కూడా ఎక్కువగానే పెరిగాయి. ఏప్రిల్ 8న ఢిల్లీలో 388 మంది కరోనా పేషెంట్లు హోం ఐసోలేషన్‌లో ఉండగా… 14వ తేదీ నాటికి 48శాతం పెరిగి 574కు చేరినట్లు గవర్నమెంట్ లెక్కలు చెబుతున్నాయి.
అయితే ఎవరూ చనిపోకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. ఎక్కువ కేసులు స్కూళ్లలోనే వస్తుండడంతో… కేజ్రీవాల్ ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా బయటడిన క్లాస్ రూమ్‌లను తాత్కాలికంగా మూసేయాలని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదేశించారు. ఎక్కువ కేసులు వస్తే మొత్తం స్కూల్‌కు సెలవు ఇవ్వొచ్చని చెప్పారు. కరోనాపై ఈ నెల 20న సమీక్ష జరుపుతామన్నారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ… దేశవ్యాప్తంగా మాత్రం పెద్దగా మార్పులేదు. గురువారం నాడు దేశవ్యాప్తంగా 949 కేసులు రాగా… ఆరుగురు కరోనాతో చనిపోయారు. డెయిలీ పాజిటివిట రేట్ 0.26శాతంగా ఉంది. కరోనా కారణంగా గత రెండేళ్లు దేశంలో చదువులు సరిగా సాగలేదు. ఈ విద్యాసంవత్సరమే పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరచుకున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ ఢిల్లీలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.