Delhi: ప్రజాశ్రేయస్సు కోసం చట్టాలను రూపొందిస్తారు. అయితే ఆ చట్టాలను కొందరు వాళ్ల స్వార్ధానికి దుర్వినియోగం చేస్తారు. అలా చట్టాన్ని దుర్వినియోగం చేసిన మహిళకు ఢిల్లీ కోర్టు లక్ష రూపాయలు జరిమాన విధించింది. వివరాలలోకి వెళ్తే.. చిన్న పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టమే పోక్సో. అయితే ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఓ మహిళ తప్పుడు ఫిర్యాదు చేసింది. వ్యక్తిగత కక్షను సాధించడానికి తన 5 సంవత్సరాల కుమార్తె పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. అయితే ఆ మహిళ తప్పుడు ఆరోపణలు చేసింది కోర్టులో రుజువైంది. దీనితో తప్పుడు ఆరోపణలు చేసి నిందితుల మానసిక వ్యథకు, పరువు నష్టంకు కారణమైనందున, అలానే చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకుగాను ఆమెకు ఢిల్లీ కోర్టు లక్ష రూపాయల జరిమానాను విధించింది.
Read also:Nepal : నేపాల్లో పెరిగిన హిందూ రాష్ట్ర డిమాండ్.. అల్లకల్లోలం అక్కడ
కాగా నిందితుల నుండి ఆస్తి కాజేయడానికి అలానే రోజువారీ గొడవల నుండి తనను తాను రక్షించుకోవడానికి కోపంతో మహిళ తప్పుడు ఫిర్యాదును దాఖలు చేసిందని అడిషనల్ సెషన్స్ జడ్జి సుశీల్ బాలా దాగర్ పేర్కొన్నారు. ఇలా భూవివాదాలు, వివాహ సమస్యలు, వ్యక్తిగత ద్వేషాలు, రాజకీయ ఉద్దేశాలు, వ్యక్తిగత స్వలాభం వంటి వివిధ కారణాలతో పోక్సో చట్టం తరచుగా దుర్వినియోగం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళను నెలలోగా లక్ష రూపాయలు జరిమాన కట్టాల్సిందిగా ఆదేశించారు. మహిళ ఏ కారణాల చేతనైన గడువు లోపు జరిమాన చెల్లించని పక్షాన ఆమెకు 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు.