Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్

  • నా ప్రమోషన్ నిలిపేయండి: ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్..
  • ఇటీవల జంతర్ మంతర్ నిరసన సమయంలో మహిళా యూట్యూబర్ ఆరోపణలు..
  • అనుచితంగా తాకినట్లు ఆరోపించిన మహిళ..
  • వివేక్ భగత్‌పై క్రైమ్ బ్రాంచ్ విచారణ..
Delhi Police

Delhi Police

Vivek Bhagat: తనపై వచ్చిన లైంగిక వేధింపుల విచారణ కొనసాగుతున్నందున తన ప్రమోషన్‌ను నిలిపేయాలని ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్ కోరారు. వచ్చిన ప్రమోషన్ ఉత్తర్వుల్ని ప్రస్తుతానికి నిలిపేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరుతూ లేఖ రాశారు. అక్టోబర్ 02 జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. ఈ నిరసనల సమయంలో వివేక్ భగత్ తనను అనుచితంగా తాకాడంటూ ఓ మహిళా యూట్యూబర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), ఇతర సంఘాలు వివేక్ భగత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

ఇది జరిగి రెండు రోజుల తర్వాత అక్టోబర్ 05న అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడిషనల్ డీసీపీ)గా ప్రమోషన్ లభించింది. మొత్తం 12 మంది పోలీసు అధికారులను ఈ ర్యాంకుకు ప్రమోట్ చేస్తూ డిప్యూటీ సెక్రటరీ (హోం) రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రమోషన్ నిలిపేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం వివేక్ భగత్ న్యూఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్(SDPO)గా పనిచేస్తున్నారు.

ఇదిలా ఉంటే, వివేక్ భగత్‌ను చెడుగా చిత్రీకరించేందుకు కొందరు ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వివేక్‌ను చెడుగా చూపించే నకిలీ సీసీటీవీ ఫుటేజ్‌ను సర్క్యూలేట్ చేసిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు సోషల్ మీడియా అకౌంట్ హర్యానాకు చెందిన వ్యక్తిగా తేల్చి అతడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ఏఐ టూల్స్ వాడి నకిలీ వీడియో క్రియేట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రతిష్ఠను దెబ్బతీయడం, నిరసనకారులను రెచ్చగొట్టడం, అశాంతి సృష్టించడం అతడి ఉద్దేశమని పోలీసులు పేర్కొన్నారు.