Site icon NTV Telugu

Arvind Kejriwal: జైలులో లొంగిపోయేందుకు బయలుదేరిన కేజ్రీవాల్..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయేందుకు తన నివాసం నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడి ఆశీస్సులు పొందనున్నారు. లొంగిపోయే ముందు ఆయన ఆప్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తలు, పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత తీహార్ జైలులో లొంగిపోతారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్ తన నివాసం నుంచి బయలుదేరారు.

Read Also: Atishi: ఢిల్లీలో నీటి ఎద్దడి.. యూపీ, హర్యానా ముఖ్యమంత్రులకు మంత్రి లేఖ

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మార్చి నెలలో అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. దాదాపుగా 50 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మే 10 నుంచి జూన్ 1 వవరకు 21 రోజుల పాటు కేజ్రీవాల్‌కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న లొంగిపోవాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను జైలుకు వెళ్లొద్దంటే ఆప్‌కి, ఇండియా కూటమికి ఓటేయాలని ఢిల్లీ ప్రజలను కోరారు. మరోవైపు ఢిల్లీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ జూన్ 5న విచారణకు రానుంది.

‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన బయటకు వచ్చి ఎన్నికల కోసం ప్రచారం చేసి ప్రజాస్వామ్య ప్రక్రియకు సహకరించారు. మేము సుప్రీంకోర్టును గౌరవిస్తాము. ఆప్ నాయకుడు ఎవరూ భయపడరు. అరవింద్ కేజ్రీవాల్ లొంగిపోబోతున్నాడు మరియు అతను ఈ రోజు తీహార్ వెళ్తున్నాడు’’ అని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ అన్నారు.

Exit mobile version