Site icon NTV Telugu

Delhi Airport: ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీకి చోటు.. టాప్‌ టెన్ 10లో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు..

Delhi Airport

Delhi Airport

Indira Gandhi International Airport: ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరో ఘనత సాధించింది. ఇప్పటికే దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ ఎయిర్ పోర్టు.. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 9వ స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) జాబితా ప్రకారం 5.94 కోట్లకు పైగా ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ విమానాశ్రయం 2022లో ప్రపంచంలోనే తొమ్మిదవ రద్దీగా ఉండే విమానాశ్రయంగా అవతరించింది.

Read Also: Two Women Fight : మెట్రోలో కొట్టుకున్న ఇద్దరు మహిళలు

2022లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాల జాబితాలో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ఏడాదికి 9.37 కోట్ల ప్రయాణికులతో అగ్రస్థానంలో ఉందని ఏసీఐ తెలిపింది. ఆ తరువాతి స్థానాల్లో డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్‌పోర్ట్ 7.34 కోట్ల ప్రయాణికులు, డెన్వర్ ఎయిర్‌పోర్ట్ (6.93 కోట్ల ప్రయాణికులు), మరియు చికాగో ఓ’హేర్ ఎయిర్‌పోర్ట్ (6.83 కోట్ల ప్రయాణికులు) ఉన్నాయి.

దుబాయ్ ఎయిర్ పోర్టు 5వ స్థానంలో, ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు 7వ స్థానంలో, లండన్ హీత్రూ విమానాశ్రయం 8వ స్థానంలో, , ఢిల్లీ ఎయిర్ పోర్టు 9వ స్థానంలో, పారిస్ చార్లెడ్ డి గల్లె ఎయిర్ పోర్టు 10వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ విమానాశ్రయం 2021లో 13వ స్థానంలో, 2019లో 17వ స్థానంలో ఉండగా.. 2022 9వ అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుగా నిలిచింది. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల నుంచి టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక విమానాశ్రయం ఢిల్లీనే. ఏసీఐ ప్రకారం గ్లోబల్ ట్రాఫిక్ లో 10 శాతానికి ఈ టాప్ 10 విమానాశ్రయాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కోవిడ్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు మామూలు స్థితికి చేరుకున్నాయి. 2022లో ప్రపంచ ప్రయాణికుల రద్దీ 7 బిలియన్లకు చేరుకుందని ఏసీఐ తెలిపింది.

Exit mobile version