Death threats to a Muslim cleric over Rashtra Pita remarks: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ముస్లిం మేధావులను, ముస్లిం మతపెద్దలను వరసగా కలిశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ముస్లిం నాయకులతో భేటీ కావడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 22న మోహన్ భగవత్ ఢిల్లీలోని ఓ మసీదుతో పాటు మదర్సాను సందర్శించారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ హెడ్ ఉమర్ అహ్మద్ ఇలిమాసీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇలియాసీ, మోహన్ భగవత్ ను ‘రాష్ట్రపిత’గా సంబోధించారు.
ఓ హిందూ సంస్థ చీఫ్ ను ఇలాగా ముస్లిం మత గురువు రాష్ట్రపితగా అభివర్ణించడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్ర పిత కామెంట్స్ నేపథ్యంలో అహ్మద్ ఇలియాసీకి బెదిరింపులు ఎదురువుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న ఫోన్లలో చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యల తర్వాతే తరుచుగా బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముస్లిం సమాజంలో ఆర్ఎస్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతను చెరిపేయడంతో పాటు దేశంలో శాంతి సామరస్యాలు పెంచేలా పలువురు ముస్లిం మేధావులను, మతగురువులను కలుస్తున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఇలియాసీతో మీటింగ్ సమయంలో అక్కడ ఉన్న మదరసా విద్యార్థులతో కూడా ముచ్చటించారు. భగవంతుడిని ఆరాధించే పద్ధతులు వేరుగా ఉంటాయి కానీ.. అతిపెద్ద మతం మానవత్వం అని భగవత్ అన్నారని ఇలియాసీ చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం కంప్యూటర్ నైపుణ్యాలను పెంచుకోవాలని భగవత్ సూచించినట్లు ఇలియాసీ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం.. ఇలియాసీ మాట్లాడుతూ.. నా ఆహ్వానం మేరకు మోహన్ భగవత్ వచ్చారని..ఆయన ‘రాష్ట్ర పిత’, ‘రాష్ట్ర ఋషి’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వల్లే ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి.
