NTV Telugu Site icon

Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులతో సహా 9 మంది మృతి

Kerala Road Accident

Kerala Road Accident

Deadly road accident in Kerala – 9 people killed: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలక్కాడ్ జిల్లా ఇక్కడి వడక్కెంచేరిలో పర్యాటకుల బస్సు, కేరళ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఎర్నాకులంలోని ముళంతురుతిలోని బేసిలియస్ స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు, కేరళ ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఓ కారును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు ప్రమాదానికి గురై వాగులో బోల్తా పడింది. వలయార్ వడక్కంచేరి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం విద్యార్థులతో సహా 9 మంది మరణించారు. 12 మందికి తీవ్రగాయాలు కాగా.. 28 మందికి స్వల్పగాయాలయ్యాయి. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో టూరిస్టు బస్సులో 41 మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. కేరళ ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Read Also: Anti Hijab Protest In Iran: హిజాబ్ తీసేసి నిరసనల్లో పాల్గొన్న స్కూల్ విద్యార్థినులు..

మరణించిన వారిలో కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు, టూరిస్టు బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఉన్నారు. త్రిసూర్ కు చెందిన రోహిత్ రాజ్(24), కొల్లాంకు చెందిన అనూప్(22), పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు నాన్సీ జార్జ్, వీకే విష్ణు ఉన్నారు. క్షతగాత్రులను పాలక్కాడ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి మృతదేహాలను అలత్తూర్, పాలక్కాడ్ ఆస్పత్రులకు తరలించారు. 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఎర్నాకులంలోని మూలంతురుతిలోని బేసిలియస్ స్కూల్ 10,11,12 తరగతుల విద్యార్థులు టూరిస్టు బస్సులో విహారయాత్రకు వెళ్లారు. ఊటీకి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగింది. టూరిస్టు బస్సు ఓవర్ స్పీడ్ తో కొట్టారక్కరా నుంచి కోయంబత్తూర్ వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంతో ప్రమాద తీవ్రత తగ్గింది. టూరిస్ట్ బస్సు డ్రైవర్ హెవీ డ్రైవింగ్ వల్ల అలసిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత రెవెన్యూ మంత్రి, పాలక్కాడ్ కలెక్టర్లు సహాయ చర్యలను సమన్వయం చేస్తున్నారు.

 

Show comments