Site icon NTV Telugu

Bilawal Bhutto: మొన్న ‘‘రక్తం ప్రవహిస్తుంది’’ అని వార్నింగ్.. నేడు ‘‘శాంతి’’ వచనాలు..

Bilawal Bhutto

Bilawal Bhutto

Bilawal Bhutto: ‘‘సింధు నది జలాల’’ను నిలిపేస్తే అందులో భారతీయులు రక్తం పారుతుందని హెచ్చరించిన బిలావల్ భుట్టో జర్దారీ, నేడు శాంతి వచనాలు వల్లిస్తున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పెరిగింది. ఈ దాడి వెనక పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉంది. దీంతో, భారత్ పాకిస్తాన్‌తో ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని తర్వాత, భారత్‌కి వార్నింగ్ ఇస్తూ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో రక్తం పారుతుందని వార్నింగ్ ఇచ్చాడు.

Read Also: Off The Record: ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి గ్యాప్ పెరుగుతుందా..?

ఇదిలా ఉంటే, తాజాగా శాంతి చర్చలకు సిద్ధమని బిలావల్ భుట్టో ప్రకటించారు. మంగళవారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిరాలే అని, ఉగ్రవాదాన్ని పాక్ ఎగుమతి చేయడం లేదని పేర్కొన్నాడు. పాకిస్తాన్ స్వేచ్ఛ కోసం పోరాడటానికి కట్టుబడి ఉందని, సంఘర్షణ కోసం కాదని అన్నారు. ‘‘భారత్ శాంతి మార్గంలో నడవాలనునకుంటే, వారు పిడికితో కాదని, తెరిచిన హస్తాలతో రావాలి. వారు కట్టుకథలతో కాకుండా, నిజాలు మాట్లాడాలి’’ అని ఆయన అన్నారు. ‘‘వారు అలా చేయకుంటే పాకిస్తాన్ ప్రజలు మోకరిల్లరు. పాకిస్తాన్ ప్రజలు పోరాడాలనే సంకల్పం కలిగి ఉన్నారు. పాకిస్తాన్ స్వేచ్ఛ కోసం పోరడటానికి కట్టుబడి ఉన్నారు, యుద్ధానికి కాదు’’ అని అన్నారు.

దీనికి ముందు, భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపేయడంపై భుట్టో మాట్లాడుతూ.. సింధు నది పాకిస్తాన్‌కి చెందుతుంది, సింధు జలాలను ఆపేస్తే భారతీయుల రక్తం అందులో ప్రవహిస్తుంది అంటూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాత, ఇది తన ప్రతిచర్య కాదని పాకిస్తాన్ ప్రజల భావాలను వ్యక్తపరిచానని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ గతంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందని, అది చరిత్ర అని, తాము కూడా ఉగ్ర బాధితులనే అని చెప్పారు. భారత్, పాకిస్తాన్‌పై సైనిక దాడి చేస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో భుట్టో నుంచి శాంతి ప్రకటన వచ్చింది.

Exit mobile version