NTV Telugu Site icon

Devendra Fadnavis: ‘‘ అందుకే నా భార్యని టార్గెట్ చేస్తున్నారు ’’.. కాంగ్రెస్‌ కూటమిపై ఫడ్నవీస్ ఫైర్..

Devendra Fadnavis

Devendra Fadnavis

Devendra Fadnavis: నవంబర్ 20న మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ బుధవారం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌ని ఉద్దేశిస్తూ.. ‘‘ఆమె రీల్స్ చేయడంలో బిజీగా ఉంది’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ మండిపడుతోంది. ఈ వ్యాఖ్యలు మరాఠీ మహిళల్ని అవమానపరచడమే అని బీజేపీ అంటోంది.

Read Also: Amit Shah: అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారులు (వీడియో)

ఇదిలా ఉంటే, దీనిపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలవలేమని తెలిసినందుకే తన రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని, నా భార్య అమృతా ఫడ్నవీస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. “నా భార్యపై చేసిన ట్రోల్‌లను (వ్యాఖ్యలు) నాగరికత కలిగిన వ్యక్తి చూస్తే, వారు ఇబ్బంది పడతారు. మనం రాజకీయాల్లో ఉన్నాము, ఓపికగా ఉండాలి, సత్యాన్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఓడించలేరని నేను నా భార్యతో చెప్పాను” అని ఫడ్నవీస్ అన్నారు. ఎదుర్కోవాలంటే నేరుగా ఎదుర్కోండని, నా భార్యపై మీమ్స్ చేయడం ఏంటి..? ఇంతకీ మీరు చేస్తున్న యుద్ధం ఏమిటి..? నేను ఓపికతో ఉన్నాను, వారిని ఓడిస్తాను అని సవాల్ చేశారు.

మహారాష్ట్ర ఎన్నికలు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కూటమికి కీలకంగా మారాయి. మహాయుతి (బీజేపీ-అజిత్ పవార్-ఏక్‌నాథ్ షిండే), మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్-శరద్ పవార్- ఉద్ధవ్ ఠాక్రే) కూటముల మధ్య తీవ్రపోటీ నెలకొంది. మొత్తం 288 సీట్లకు నవంబర్ 20న ఎన్నికలు జరుగుతుండగా, 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.