Cyclone Dana: దానా తుఫాన్ తీరం దాటింది. అర్ధరాత్రి 1:30 నుంచి 3:30 మధ్య తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని భితార్కానికా నేషనల్ పార్క్, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్టు ప్రకటించారు. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినట్లు పేర్కొన్నారు. దీంతో ఒడిశా సముద్ర తీరం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఇక, ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఐఎండీ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు.
Read Also: Astrology: అక్టోబర్ 25, శుక్రవారం దినఫలాలు
ఇక, భద్రక్, జగత్సింగ్‌పూర్, బాలాసోర్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగాపొయాయి. అలాగే, ఒడిశాలో 7 వేల పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి దాదాపు ఆరు లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్- ఒడిశా మధ్య ఏకంగా 400లకు పైగా రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో పాటు కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌ల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు పూర్తిగా నిలిపివేశారు.