Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్

  • బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం
  • ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు IMD ఎల్లో అలర్ట్
  • అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకవచ్చని అంచనా
Cyclone

Cyclone

Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫానుగా మారిన తర్వాత దీనికి ‘‘అర్ణబ్’’గా పేరు నిర్ణయించారు. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. బెంగాలీ భాషలో అర్నబ్ అంటే “సముద్రం” అని అర్థం. ఈ తుఫాను అక్టోబర్ 28న ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గరిష్టంగా గంటలకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు, సముద్రంలో అలజడి ఏర్పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అక్టోబర్ 24న తూర్పు-మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అక్టోబర్ 25న పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 26 నాటికి తుఫానుగా, అక్టోబర్ 27 నాటికి తీవ్ర తుఫానుగా మారి, ఆ తర్వాత మరింత బలపడి అక్టోబర్ 28 ఉదయానికి ఏపీ తీరానికి చేరవచ్చని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, అక్టోబర్ 28 ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీర ప్రాంతంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. గరిష్టంగా 115-125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, అప్పుడప్పుడు ఈ ఈదురుగాలుల వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని ఐఎండీ చెబుతోంది.

బంగాళాఖాతంలో మార్పుల వల్ల ఇప్పటికే పుదుచ్చేరిలో అక్టోబర్ 24 రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపజు, తుఫాను ముప్పు కారనంగా ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో అక్టోబర్ 28,29 తేదీల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.