India strong warning to Pakistan and China: దాయాది దేశం పాకిస్తాన్, డ్రాగన్ దేశం చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)పై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో చేరడానికి మూడో దేశాన్ని ప్రొత్సహించాలని చైనా, పాకిస్తాన్ చూస్తున్న తరుణంలో భారత్ ఘాటుగా బదులిచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అరిందమ్ బాగ్చీ భారత్ నిర్ణయాన్ని వెల్లడించారు.
పాకిస్తాన్ ఆక్రమించుకున్న భారత భూభాగంలో సీపెక్ ప్రాజెక్టును నిర్మిస్తున్నా చైనా, పాకిస్తాన్. శుక్రవారం జరిగిన సీపెక్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఈ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తిగా మూడో దేశాన్ని స్వాగతించాలని చైనా నిర్ణయించింది. ఈ నిర్ణయంపై భారత్ తన వైఖరిని తెలియజేసింది. మంగళవారం అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ..సీపెక్ కింద ఇటువంటి కార్యకలాపాలు చట్టవిరుద్ధం అని.. ఆమోదయోగ్యం కాదని భారత్ తన వాదనను తెలియజేసింది. ఏ దేశమైనా ఇందులో చేరితే భారత దేశ సార్వభౌమాధికారిన్ని, ప్రాదేశిక సమగ్రతను ధిక్కరించడమే అవుతుందని.. బాగ్చీ అన్నారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో ఉన్న సీపెక్ ప్రాజెక్టును భారత్ ధృఢంగా, స్థిరంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు.
Read Also: CM Nitish Kumar: బీహార్ సీఎంకు కరోనా పాజిటివ్.. ఏడాదిలో ఇది రెండోసారి
సీపెక్ ద్వారా పాకిస్తాన్ రోడ్డు, రైలు మార్గాలను నిర్మిస్తోంది. చైనా నుంచి భారీగా అప్పులు తీసుకుని ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది పాకిస్తాన్. చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ గ్వాదర్ పోర్టు వరకు ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్( బీఆర్ఐ) ప్రాజెక్టులో భాగంగా సీపెక్ ను చైనా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుపై అటు బెలూచిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ సైన్యంతో పాటు అక్కడ చైనీయులపై తరుచుగా దాడులు చేస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి దిగజారినా.. కూడా పట్టించుకోవడం లేదు.