NTV Telugu Site icon

Covishield: కోవిషీల్డ్ మరణాలకు కారణమైందా..? కేసు వేసేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు..

Covid Vaccine

Covid Vaccine

Covishield: ఆస్ట్రాజెనికా, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ కొందరిపై ప్రతికూల దుష్ప్రభావాలు చూపించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ పిల్లలు మరణించారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరంతా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని దేశవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చారు. అయితే, ఈ వ్యాక్సిన్ రోల్ అవుట్‌లో పాల్గొన్న ప్రభుత్వ సంస్థల అధికారులపై, సీరం ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ ఇండియాపై దావా వేయాలని దేశవ్యాప్తంగా బాధిత తల్లిదండ్రుల బృందం భావిస్తోంది.

Read Also: High Tension: గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం.. జనసేన- వైసీపీ మధ్య ఘర్షణ..

ఆస్ట్రాజెనికా రూపొందించిన కోవిట్ టీకా కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో రక్తం గడ్డకట్టే ప్రమాదకరమైన పరిస్థితికి కారణమవుతుందని UK కోర్టులో ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఆ తర్వాత పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు కేసు వేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన రచన గంగూ, కోయంబత్తూరుకు చెందిన వేణుగోపాలన్ గోవిందన్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. తమ ప్రియమైన వారిని కోల్పోయిన 8 కుటుంబాలు కలిసి వస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరికొన్ని కుటుంబాలు వీరితే చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ 8 కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్, కేరళ, ముంబై, కోయంబత్తూర్, కపుర్తలాకు చెందినవి. తల్లిదండ్రులు తయారీ సంస్థతో పాటు ప్రభుత్వం సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.