Site icon NTV Telugu

Covid BF.7 Variant: భారతీయుల్ని ఏ వేరియంట్ ఏం చేయలేదు.. బీఎఫ్-7 మన ముందు జుజుబీ..ఎందుకంటే..?

Covid 19

Covid 19

Covid BF.7 Variant May Not Be As Serious In India As In China: చైనాను కల్లోలం సృష్టిస్తోంది కరోనా కొత్త వేరియంట్. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ వల్ల చైనాలో ఉప్పెనలా కరోనా కేసులు వస్తున్నాయి. అక్కడ గడిచిన 20 రోజుల్లోనే దాదాపుగా 25 కోట్ల కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఒకే రోజు 3.7 కోట్ల కేసులు నమోదు అవుతాయని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనావేస్తున్నాయి. ఇప్పటికే చైనా రాజధాని బీజింగ్ తో పాటు వాణిజ్య రాజధాని షాంఘైలో కుప్పలుకుప్పలుగా కేసులు నమోదు అవుతున్నాయి. చైనాలో ప్రతీ ఆస్పత్రి కూడా కోవిడ్ రోగులతో నిండిపోయింది. చివరకు అక్కడ జ్వరం మందులు కూడా దొరకని పరిస్థితి ఉంది.

ఇదిలా ఉంటే బీఎఫ్-7 వేరియంట్ వల్ల భారతదేశం కూడా అప్రమత్తం అయింది. అయితే చైనాతో పోలిస్తే ఇండియాపై బీఎఫ్ 7 వేరియంట్ పెద్దగా ప్రభావం చూపించదని నిపుణులు అంచనా వేస్తున్నారు. సీఐఎస్ఆర్- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ వినయ కే నందికూరి చెబుతున్నదాని ప్రకారం ఇండియాలో బీఎఫ్-7 తీవ్రత పెద్దగా ఉండదని తెలుస్తోంది. చైనా వారితో పోలిస్తే భారతీయులు ఎప్పుడో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ని సాధించారని ఆయన తెలిపారు. అయితే కొన్ని వేరియంట్లు రోగనిరోధక శక్తిని తప్పించుకే సామర్థ్యం ఉందని.. టీకాలు వేసినా కూడా కొన్ని సార్లు కొత్తవేరియంట్లు వ్యక్తులకు సోకుతుందని అన్నారు.

Read Also: Drinking Alcohol: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆల్కహాల్ తాగేవాళ్లకు అమ్మాయిలను ఇవ్వకండి

డెల్టా తీవ్రత వల్ల భారతదేశంలో భారీగా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ డెల్టా వేరియంట్ వల్ల చాలా మంది చనిపోయారు. దీని తర్వాత భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున ప్రారంభం అయింది. ఆ తరువాత ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినా.. పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎందుకంటే అప్పటికే భారతీయులు సామూహికంగా రోగనిరోధక శక్తి ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ని సాధించారు. ప్రస్తుతం దేశంలో బీఎఫ్ -7 కేసులు నాలుగు మాత్రమే నమోదు అయ్యాయి. ఇందులో రెండు కేసులు కేవలం ఇంటిలోనే నయం అయ్యాయి. దీని వల్ల చైనా వాళ్లు ఎదుర్కొంటున్నట్లుగా బీఎఫ్-7 వేరియంట్ భారతీయులపై ప్రభావాన్ని చూపించదు.

చైనా అవలంభిస్తున్న ‘జీరో కోవిడ్’ విధానం వల్ల అక్కడి ప్రజలు పూర్తిస్థాయిలో కరోనాకు ఇమ్యూనిటీ పొందలేదు. తాజాగా ఈ విధానాన్ని ఎత్తేయడంతో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు చైనా వ్యాక్సిన్లు కూడా సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయులు రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు ఫ్రికాషనరీ, బూస్టర్ డోసులు కూడా వేసుకుంటున్నారు. దీంతో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వచ్చినా భారతీయులు తట్టుకోగలరని తెలుస్తోంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో కోవిడ్ సదుపాయాలు, ఆక్సిజన్ లభ్యత, తగినన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. దీంతో దేశం ఎలాంటి విపత్తును అయిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని భారతప్రభుత్వం తెలుపుతోంది.

Exit mobile version