NTV Telugu Site icon

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీద్ కమిటీకి ఎదురుదెబ్బ.. సర్వే ఆపేది లేదని స్పష్టం చేసిన కోర్టు..

Gyanvapi Mosque

Gyanvapi Mosque

Gyanvapi Mosque: కాశీలో జ్ఞానవాపి మసీదుపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో వారణాసి కోర్టు తీర్పును అనుసరించి వీడియో సర్వే చేయగా, మసీదులోని వాజుఖానాలోని బావిలో శివలింగం వంటి నిర్మాణం వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా మసీదు వెలుపలి గోడలపై హిందూ దేవీదేవతల బొమ్మలను గుర్తించారు. ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా విచారించాయి. హిందువులు వాజూఖానాలోని కనిపించింది శివలింగం అని చెబుతుంటే.. ముస్లింలు మాత్రం ఇది ఫౌంటేన్ అని తమ వాదన వినిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో శాస్త్రీయ సర్వేను చేపట్టింది. అయితే దీనిని నిలిపివేయాలని జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీ అంజుమన్ ఇంతేజామియా కోర్టుకును కోరింది. కమిటీ వేసిన పిటిషన్ ని విచారించిన వారణాసి జిల్లా కోర్టు సర్వేను ఆపేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికీ ఈ సర్వేకు అలహాబాద్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు అనుమతి లభించిందని జస్టిస్ ఎకే విశ్వేష్ అన్నారు. అందువల్ల కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయమూర్తి తెలిపారు.

Read Also: Pakistan: టీవీ లైవ్ డిబెట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. పాకిస్తాన్ అంటే ఇంతే మరి..!

17వ శతాబ్ధపు మసీదు హిందూదేవాలయంపై నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న మసీదు ప్రాంతంలో శాస్త్రీయ సర్వే నిర్వహిస్తోంది. అయితే నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఏఎస్ఐ సర్వే జరుగుతోతందని మసీదు కమిటీ జిల్లా కోర్టులో వాదించిందని ప్రభుత్వం తరుపు న్యాయవాది రాజేష్ మిశ్రా తెలిపారు. పిటిషన్ వేసిన వారికి ఎలాంటి నోటీసులు అందలేదని, ఎలాంటి ఫీజు చెల్లించలేదని మసీదు కమిటీ వాదించింది.

జ్ఞాన్‌వాపి మసీదులోని వాజూఖానాలో సర్వే చేయాలన్న హిందూ పక్షం పిటిషన్ ను కూడా కోర్టు విచారించిందని, ఈ అంశంపై అక్టోబర్ 5వ తేదీకి కోర్టు విచారణను వాయిదా వేసిందని మిశ్రా తెలిపారు. వారణాసి జిల్లా కోర్టు సర్వే ఉత్తర్వులను అలహాబాద్ హైకోర్టు సమర్థించిన తర్వాత సర్వే ప్రారంభమైంది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా సర్వే అవసరం అని కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.