NTV Telugu Site icon

Vikram-S: దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం.. అంతరిక్ష రంగంలో నూతన శకం..

Vikram S Rocket

Vikram S Rocket

Country’s first privately developed rocket Vikram-S expected to be launched by next week: అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ ఇందుకు ఓ ఉదాహరణ. భారత్ కూడా అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ‘‘ విక్రమ్-ఎస్’’ ప్రయోగానికి సిద్ధం అవుతోంది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ తొలిసారిగా రాకెట్ ను విశ్వంలోకి ప్రయోగించనుంది. తన తొలి మిషన్ కు ‘ప్రారంభ్’అని పేరు పెట్టింది.

Read Also: PM Narendra Modi: ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు.. జీ 20 లోగో ఆవిష్కరించిన ప్రధాని

నవంబర్ 12-16 మధ్య ఈ ప్రయోగం జరగబోతోన్నట్లు స్కైరూల్ ఏరోస్పేస్ మంగళవారం ప్రకటించింది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి విక్రమ్ ఎస్ రాకెట్ ను ప్రయోగించనున్నారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా తుది తేదిని నిర్ణయించనున్నట్లు సంస్థ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన తెలిపారు. ఈ మిషన్ ద్వారా భారతదేశంలో తొలి రాకెట్ ప్రయోగం చేపట్టిన సంస్థగా స్కైరూట్ ఏరోస్పేస్ నిలవనుంది. 2020లో భారత ప్రభుత్వం స్పేస్ టెక్నాలజీలోకి ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

విక్రమ్ ఎస్ రాకేట్ ఒకే దశ, సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికిల్..ఇది మూడు కస్టమర్ పేలోడ్లను కలిగి ఉంటుందని ఆ సంస్థ చీఫ్ ఆరేటింగ్ ఆఫీసర్ నాగ భరత్ డాకా వెల్లడించారు. భారత అంతరిక్ష కార్యక్రమ వ్యవస్థాపకులు ప్రఖ్యాత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ కు నివాళిగా స్కైరూట్ తన రాకెట్ కు విక్రమ్ అని పేరు పెట్టింది. స్కైరూట్ విక్రమ్ రాకెట్ మూడు వేరియంట్లను రెడీ చేస్తోంది. విక్రమ్-1 480 కిలోల పేలోడ్ ను ఎర్త్ ఆర్బిట్ కు మోసుకెళ్లగలిగితే.. విక్రమ్-2 595 కిలోల, విక్రమ్-3 815 కిలోల పెలోడ్ మోసుకెళ్లగలదు. స్కైరూట్ అంతరిక్షంలోకి తక్కువ ఖర్చుతో వాణిజ్య ఉపగ్రహాలను ప్రయోగించడానికి అత్యాధునిక ప్రయోగ వాహనాలను నిర్మిస్తోంది. రానున్న రోజుల్లో అంతరిక్ష పోటీలో మరిన్ని ప్రైవేటు కంపెనీలు రానున్నాయి.