Delhi Hit And Drag Case: కొత్త సంవత్సరం తొలిరోజున ఢిల్లీలో యువతిని ఢీకొట్టి దాదాపుగా 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపుగా 13 కిలోమీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లారు. కారు కింద చిక్కుకుపోయిన యువతి తీవ్ర గాయాలపాలై మరణించింది. ఈ కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారు. ఛార్జిషీట్ లో 117 మంది సాక్షులను చేర్చింది. ఐదుగురు నిందితులు దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్ లపై హత్య, హత్యకు కుట్ర పన్నడం, సాక్ష్యాాలు ధ్వంసం చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Read Also: Vijay Yesudas: యేసుదాసు తనయుడి ఇంట్లో భారీ చోరీ.. నగలు, పత్రాలు మాయం
ఇదిలా ఉంటే కారు యజమాని అశుతోష్, పరారీలో ఉన్న అంకుష్ లపై సాక్ష్యాధారాలు నాశనం చేయడం, పోలీసులకు తప్పుడు సమాచారం అందించడం, కుట్ర, నిందితులను రక్షించడం వంటి అభియోగాలను మోపారు. ఈ కేసులో దీపప్ ఖన్నా, అమిత్ ఖన్నా, క్రిషన్, మనోజ్, మిథున్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా.. అశుతోష్, అంకుష్ బెయిల్ పై బయట ఉన్నారు. విచారణ సమయంలో సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఏడాది తొలిరోజు జనవరి 1న న్యూఇయర్ పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్న అంజలి సింగ్( 20) అనే మహిళను కారు ఢీకొట్టి 13 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లింది. జనవరి 1న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూటీపై వెళ్తున్న అంజలి సింగ్ ను కారు ఢీ కొట్టింది. ఆ తరువాత ఆమె కారు కింది భాగంలో చిక్కుకుపోయింది. అయితే మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధిత యువతి కారు కింద చిక్కుకుందని తెలిసీ కూడా కారును వేగంగా పోనిస్తూ ఆమె మరణానికి కారణం అయ్యారు. దాదాపుగా రెండు గంటల పాటు కారులో తిరిగారు. యువతి శరీరం దాదాపుగా నుజ్జునుజ్జు అయింది.