NTV Telugu Site icon

Haryana CM: హర్యానా సీఎం వివాదస్పద వ్యాఖ్యలు..

Haryana Cm

Haryana Cm

Haryana CM: హర్యానా సీఎం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరినీ రక్షించడం ప్రభుత్వ యంత్రాంగం వల్ల కాదని అన్నారు. హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగాలు ప్రతి ఒక్కరినీ కాపాడలేవని అన్నారు. రాష్ట్ర పౌరులు సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని కోరారు. కొన్నిసార్లు సైన్యం, పోలీసులు ఇందుకు హామీ ఇవ్వలేకపోవచ్చని చెప్పారు. హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వారిలో డిప్యూటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు స‌హా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది.

Read also: Switzerland: భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులు నిలిపివేత

అల్లర్లలో జరిగిన నష్టానికి పరిహారాన్ని ఎవరిస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు ఖట్టర్ వివాదాస్పదంగా మాట్లాడారు. అల్లర్లకు కారణమైనవారే నష్టాన్నిభర్తీ చేస్తారని అన్నారు. ప్రభుత్వం నష్టాన్నంతటికీ పరిహారాలు ఇవ్వబోదని.. కేవలం నష్టపోయిన ప్రభుత్వ ఆస్తులకు మాత్రమే పరిహారాన్ని కేటాయిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులకు ప్రభుత్వం జవాబుదారీ కాదని వెల్లడించారు. హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప‍్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.