Site icon NTV Telugu

Madhya Pradesh: రూ. 100 కోట్లతో సంత్‌ రవిదాస్‌ ఆలయ నిర్మాణం.. రేపు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ

Modi

Modi

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో మరో ఆలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేయనున్నారు. రూ. 100 కోట్ల వ్యయంతో సంత్‌ రవిదాస్‌ ఆలయం నిర్మించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో రూ. 100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సంత్‌ రవిదాస్‌ ఆలయానికి ప్రధాని నరేంద్రమోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. శంఖుస్థాపన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని గత ఐదు నెలల్లోనే నాలుగుసార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు. నూతన ఆలయం 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. నగరా శైలిలో నిర్మించనున్నారు. రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. సంత్‌ రవిదాస్‌ గురించి ఆధునిక సమాజానికి తెలిసేలా ఓ మ్యూజియాన్ని అక్కడ ఏర్పాటు చేయనున్నారు. మ్యూజియంలో రవిదాస్‌ భక్తి మార్గం, నిర్గుణ ఆరాధన, తత్వశాస్త్రం, సాహిత్యం గ్యాలరీలు ఉంటాయి. గ్రంథాలయం, సమావేశ మందిరం, జల కుంద్‌, భక్తి నివాస్‌లను కూడా నిర్మించనున్నారు.

Read also: Pawan Kalyan: ఆ వ్యాధితో నరకం అనుభవించిన పవన్ కళ్యాణ్.. ఎవరికీ తెలియని నిజం

సంత్‌ రవిదాస్‌ 14వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్తగా పేరు పొందారు. మధ్యయుగ కాలంలో భారతదేశంలో భక్తి ఉద్యమ బాగా ప్రాచుర్యం పొందిన సమయంలో అప్పటి ప్రముఖుల్లో ఒకరిగా సంత్‌ రవిదాస్‌ కీర్తి గడించారు. ఇప్పటికే సత్నా జిల్లాలోని మైహర్‌లో రూ.3.5 కోట్ల వ్యయంతో సంత్‌ రవిదాస్‌ ఆలయాన్ని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం నిర్మించింది. బుందేల్‌ ఖండ్‌లో భాగమైన సాగర్‌లో 20 నుంచి 25 శాతం మంది దళిత జనాభా నివసిస్తున్నారు. రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాల్లో 35 ఎస్సీ రిజర్వ్‌డ్‌ చేయబడ్డాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో భాజపా వీటిలో 28 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ 2018లో జరిగిన ఎన్నికల్లో ఆ సంఖ్య 18కి పడిపోగా.. కాంగ్రెస్‌ 17 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఇప్పుడు తిగిరి తమ స్థానాలను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ రూ. 100 కోట్లతో సంత్‌ రవిదాస్‌ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ఆలయం నిర్మితమైతే దేశ, విదేశాల నుంచి సంత్‌ రవిదాస్‌ భక్తులు ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు. ఎక్కువ మంది భోజనం చేసే వీలుండేలాగా సుమారు 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భోజనశాలను నిర్మించనున్నారు.

Exit mobile version