Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగుతున్న మహా కుంభమేళాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది యోగి ప్రభుత్వం. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపీ అధికారులు అలర్ట్ అయ్యారు. జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉండవచ్చేని అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చురుకుగా ఉన్న 16,000 కంటే ఎక్కువ మొబైల్ నెంబర్ డేటాను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆ నంబర్లలో చాలా వరకు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కంట్రోల్ రూం నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ నుంచి అనుమానితుల ముఖాలను గుర్తించే యాప్ ద్వారా గుర్తిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Nayanthara: వాళ్ళ కారణంగా నయనతార నరకం చూసింది.. నిజాలు బయటపెట్టిన నాగార్జున !
వసంత పంచమ సందర్భంగా సోమావారం జరగనున్న మూడో అమృత స్నానం సమయంలో అదనపు భద్రతను మోహరించారు. నాల్గవ మహా స్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ నాడు జరుగుతుండగా, చివరిది ఫిబ్రవరి 26న మహా శివరాత్రి నాడు జరుగుతుంది. ఇటీవల తొక్కిసలాటలో మరణించిన 30 మంది బాధితుల్లో ఎక్కువ మంది బీహార్ నుంచే ఉన్నారు. మౌని అమావాస్య రోజున భారీగా ప్రజలు రావడంతో తొక్కిసలాట జరిగింది. 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. శుక్రవారం వీరు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ ప్యానెల్ నెల రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది.