Site icon NTV Telugu

Siddaramaiah Video: నిరసన ర్యాలీలో డీకే.శివకుమార్ అనుకూల నినాదాలు.. సిద్ధరామయ్య ఆగ్రహం

Cm Siddaramaiah

Cm Siddaramaiah

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మధ్య నెలకొన్న అధికార మార్పిడి పంచాయితీ ఇంకా సమసిపోలేదు. తాజాగా మరోసారి పబ్లిక్‌గా రచ్చకెక్కింది. మంగళవారం ఎంజీఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ) పేరు మార్పుకు వ్యతిరేకంగా బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కు మద్దతుగా నినాదాలతో మార్మోగించారు. దీంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కోపం కట్టలు తెంచుకుంది. నినాదాలు ఆపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో వీబీ-జీ-రామ్-జీగా కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. సిద్ధరామయ్య, శివకుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా, మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడేందుకు కుర్చీలోంచి లేచినప్పుడు.. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ‘‘డీకే..డీకే’’ అని అరవడం ప్రారంభించారు. ప్రసంగించడానికి పోడియం దగ్గరకు వెళ్లగానే నినాదాలు మరింత ఎక్కువగా చేశారు. దీంతో కోపంతో మండిపడ్డ సిద్ధరామయ్య.. నినాదాలు ఆపమని అరిచారు. అయినప్పటికీ అలా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఇదేంటి? అంటూ నాయకులను సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇటీవల కర్ణాటకలో రెండేన్నరేళ్ల కాంగ్రెస్ పాలన పూర్తైంది. అప్పటి నుంచి అధికారం మార్పిడిపై సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య రగడ నడుస్తోంది. హస్తిన వేదికగా పంచాయితీ నడిచింది. అనంతరం బెంగళూరుకు బ్రేక్ ఫాస్ట్‌గా మారింది. ఒకరోజున సిద్ధరామయ్య ఇంట్లో.. ఇంకొక రోజు శివకుమార్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ జరిగింది. అయినా కూడా పంచాయితీ తెగలేదు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

Exit mobile version