Milind Deora: శివసేన(యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ కలగానే మిగిలిపోతుందని శివసేన( షిండే) ఎంపీ మిలింద్ దేవరా శనివారం అన్నారు. నిన్న జరిగిన మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిపై ఠాక్రే మాట్లాడుతూ.. ఎన్సీపీ, కాంగ్రెస్ ఏ అభ్యర్థిని సీఎంగా ప్రకటించినా తాను మద్దతు ఇస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే మిలింద్ దేవరా విరుచుకుపడ్డారు.
Read Also: Mallu Ravi: దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తాం
కాంగ్రెస్ మాజీ నేత అయిన మిలింద్ దేవరా మాట్లాడుతూ.. తాను ఆ పార్టీ పనితీరును నిశితంగా గమనించానని అన్నారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రేకి కాంగ్రెస్ ఎప్పటికీ మద్దతు ఇవ్వదని ఆయన వ్యాఖ్యానించారు. ఠాక్రే సీఎం కావాలనే ఆశతో కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్) కూటమికి వెళ్లారని నిన్నటి సంఘటనలో ఆయన ముఖ్యమంత్రి కావాలనేది కలగానే మిగులుతుందనేది స్పష్టమైందని అన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ ముఖ్యమంత్రి పదవి అతడికి ఇవ్వదని దేవరా చెప్పారు.
బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి ‘‘మహాయుతి’’ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఎలాంటి గందరగోళం లేదని, త్వరలోనే ప్రకటిస్తారని అన్నారు. ఇదిలా ఉంటే శివసేన(ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ మహయుతి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని సవాల్ చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలు ముఖ్యమంత్రిగా నిర్ణయించే అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఠాక్రే తన పెద్ద మనసుని చాటుకున్నారని అన్నారు.