కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. యూపీ రాజకీయాలు వేడెక్కాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పట్నుంచే సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ప్రియాంకగాంధీ నాయకత్వంలో.. ఎలక్షన్స్ వెళ్లాలని నిర్ణయించింది. ఆమెనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనీ.. సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. అయితే, పార్టీ గెలుపుకోసం ఆమె ఎంతో కష్టపడుతున్నారన్న ఖుర్షీద్.. ఈ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ కూటమి ఏర్పాటు చేయబోవట్లేదని స్పష్టం చేశారు. తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నవారిని ఆహ్వానిస్తామన్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. 403 స్థానాలకు గాను 312 సీట్లు గెలిచింది. సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్‌సమాజ్ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 7 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. అయితే, ఈసారి ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటున్న హస్తం పార్టీ వ్యూహం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి. అటు, అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు వేస్తోంది.
