Congress Party Task Force Meeting on 2024 Elections: 2024 సార్వత్రిక ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ సార్వత్రిక ఎన్నికల కోసం వ్యూహాలను రెడీ చేసుకుంటోంది. అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి పలుమార్లు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా 2024 లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ‘‘టాస్క్ ఫోర్స్’’ సమావేశం కానుంది. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమాయత్తంపై సమీక్షాసమావేశం జరగనుంది.
Read Also: Junk Food Survey: పిల్లలు జంక్ ఫుడ్ తినడానికి కారణం ఇదే.. భారతీయ తల్లిదండ్రుల అభిప్రాయం
సోమవారం కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఖర్గే తొలిసారిగా టాస్క్ ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పార్టీ కార్యచరణ రూపొందించనుంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలకు కేంద్రమైన ‘‘వార్ రూమ్’’లో ఈ సమావేశం జరుగుతోంది. ఏఐసిసి సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేశ్, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే విధంగా రాహుల్ గాంధీ చేపట్టిన ‘ భారత్ జోడో యాత్ర ’పై ప్రజల్లో వస్తున్న స్పందన గురించి కూడా నేతలు చర్చించనున్నారు. భారత్ జోడో యాత్ర మరింత ప్రభావవంతంగా ఉండేందుకు నేతల నుంచి సూచనలు తీసుకోనున్నారు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.