రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంతర్గత సమస్యలకు చెక్ పెట్టి, అందర్ని ఏకం చేసేలా, అందరి మధ్య రాజీ కుదిర్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్. పంజాబ్‌లో ఈ విషయంలో దాదాపుగా విజయం సాధించిందని చెప్పాలి. పంజాబ్‌లో ముఖ్యనేతలైన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించింది. సిద్ధూకు పంజాబ్ పీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో అక్కడ సమస్య చాలా వరకు ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా రాజస్థాన్‌లో ఉన్న అంతర్గత సమస్యలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నది. సచిల్ పైలట్ వర్గానికి చెందిన జితిన్ ప్రసాద్ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.
Read: ప్రముఖ నటికి కారు ప్రమాదం… స్నేహితురాలు మృతి
మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గెహ్లాట్ తన క్యాబినెట్‌ను పునఃవ్యవస్థీకరణ చేపట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. పార్టీని వీడీ బయటకు వెళ్లాలనుకునే వారిని బుజ్జగించి పదవులు అప్పగించడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవచ్చని పార్టీ భావిస్తున్నది. కొన్ని రోజుల కిందట సచిన్ పైలట్, అనుచరులు తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించడంతో అప్పట్లో ఆ సమస్యకు చెక్ పడింది. కాగా,ఇప్పుడు మరోసారి రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ కీచులాటలు మొదలు కావడంతో వాటిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 27 లేదా 28 వ తేదీన క్యాబినెట్‌ను విస్తరిస్తారని వార్తలు వస్తున్నాయి.
