NTV Telugu Site icon

Congress Protests: నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు.. ఢిల్లీలో 144 సెక్షన్

Congress Protests

Congress Protests

Congress Protests: రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ నేడు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ మెంబర్లు, జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారని కాంగ్రెస్ తెలిపింది. భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆగస్టు 5న ఢిల్లీలో ఆందోళనలకు అనుమతించలేమని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ తప్ప మిగతా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద బారికేడ్లతో పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. కాసేపట్లో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా నిరసనను నిర్వహించనున్నందున ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడారు.

Mamata Benerjee: దిల్లీ పర్యటనలో బెంగాల్ సీఎం.. నేడు ప్రధానితో భేటీ

జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. కలెక్టరేట్ల ముట్టడి చేపట్టి ఆందోళన నిర్వహించనున్నారు. రాష్ట్రాల రాజధానుల్లో పీసీసీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లను ముట్టడించనున్నారు. ఇక ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ సభ్యులు, జాతీయ నాయకులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తమను అణచివేయొచ్చని.. కానీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెంపుకు వ్యతిరేకంగా పోరాడి తీరుతామని.. జైలు శిక్ష విధించినప్పటికీ రాష్ట్రపతి భవన్‌, ప్రధాని ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు.