Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!

  • కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇంట్లో రాజకీయ చిచ్చు..
  • కుమార్తెను వేధిస్తున్నాడని అల్లుడు షాయాన్ మసూద్‌పై ఆరోపణలు..
  • ఇటీవల కాంగ్రెస్ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన షాయాన్..
Congress Mp

Congress Mp

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో సహరాన్‌పూర్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇంట్లో రాజకీయ చిచ్చు రగిలింది. ఆయన అల్లుడు షయన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరిన తర్వాత కుటుంబంలో ఒక్కసారిగా విభేదాలు చెలరేగాయి. ఇమ్రాన్ మసూద్ కుమార్తె సుబియా మసూద్‌పై ఆమె భర్త షాయాన్ మసూద్, మామ షాదాన్ మసూద్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎంపీ ఇమ్రాన్ మసూద్ సోదరుడు కుమారుడు హంజా నౌమాన్ మసూద్ ఈ ఆరోపణలు చేశారు.

శనివారం నాడు హమ్జా ఫేస్‌బుక్‌లో లైవ్‌లో.. గత ఐదేళ్లుగా తమ కుటుంబం బంధుత్వం, పరువు కోసం ఎన్నో విషయాలను మౌనంగా భరిస్తూ వచ్చిందని చెప్పాడు. రాజకీయ కారణాల వల్ల తన సోదరిని వేధించారని, ఆమె జీవితాన్ని నాశనం చేశారని హమ్జా ఆరోపించాడు. ఇంట్లో జరిగిన సంఘటనలకు సంబంధించిన అనేక రికార్డింగ్‌లు తమ కుటుంబ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ వివాదం మరింత ముదిరితే తాను ఈ రికార్డింగులను, వీడియోలను ప్రజల ముందు పెడతా అని హమ్జా హెచ్చరించారు. తన సోదరికి, ఆమె ఏడాది వయసు బిడ్డ బాధ్యతల్ని ఇకపై తమ కుటుంబమే చూసుకుంటుందని చెప్పారు. బిడ్డ అవసరాలను షాయాన్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించాడు. షాయాన్ తన బిడ్డ డైపర్లకు కూడా డబ్బులు ఇవ్వలేదని ఆరోపించాడు.

మరోవైపు, ఇమ్రాన్ మసూద్ కుటుంబం చేస్తున్న ఆరోపణల్ని షాయాన్ మసూద్ ఖండించారు. రాజకీయ పోటీ ఉంటే దాన్ని రాజకీయ వేదికపైనే ఎదుర్కోవాలని, కుటుంబంలోని వ్యక్తిగత విషయాలను బహిరంగం చేసి వివాదాన్ని మరింత పెంచవద్దని అన్నారు. తన వద్ద చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయని, కుటుంబ విషయాలను బయటపెట్టడం ఇష్టం లేదని అన్నారు. చర్చ ఇంటి లోపల జరిగితే, ఎలాంటి ఆరోపణలకైనా బదులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని షాయాన్ ప్రకటించారు.

ఆగస్టు 20న షాయాన్ మసూద్ కాంగ్రెస్ పార్టీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. లక్నోలో ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎస్పీలో చేరిన తర్వాత షాయాన్ ఇమ్రాన్ మసూద్ రాజకీయ విధానాలను ప్రశ్నించారు. ఆయన సిద్ధాంతాలతో తానను ఏకీభవించనని, బీజేపీని ఓడించాలంటే అఖిలేష్‌తో నిలబడటం తప్పనిసరి అని అన్నారు.