Rajyasabha Elections: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, ఇండియా కూటమిలో విభేదాలకు కారణమైంది. గెలిచే బలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్‌తో ఓడిపోయింది. ఫలితంగా బీజేపీ మద్దతు ఉన్న పరిమల్ నత్వానీ విజయం సాధించారు. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఉంటే ఒకటి అధికార జేఎంఎం, మరొకటి ఎన్డీయే కూటమి దక్కించుకున్నాయి. ఈ ఓటమిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది.
కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి ఆర్జేడీ, వామపక్ష పార్టీలే కారణమని జార్ఖండ్ పీసీసీ చీఫ్ కే. రాజు బహిరంగంగా ఆరోపించారు. రాస్ట్రంలో అధికార కూటమిలో ఐక్యత లేదని అన్నారు. మిత్రపక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు రాలేదని ఆరోపించారు. జేఎంఎం సహకరించినా, ఇతర మిత్ర పక్షాలు సహకరించలేకపోవడంతో ఓడిపోయినట్లు ఆయన చెప్పారు. అధికార కూటమి ఐక్యంగా లేకపోవడం నిజంగా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఇండియా కూటమిలో అంతర్గత కలహాలకు కాంగ్రెస్ ఆరోపణలే సాక్ష్యమని బీజేపీ పేర్కొంది. చాలా మంది ఎమ్మెల్యేలు తమ మనస్సాక్షికి అనుగుణంగానే ఓటు వేశారని ఎన్నికల ఫలితాలు చూపిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి 24 ఎమ్మెల్యేలే ఉన్నారు. గెలుపుకు 28 ఓట్లు కావాలి. పరిమల్ నత్వానీకి 28 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 20 ఓట్లు మాత్రమే వచ్చాయి.

