మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నడుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మహారాష్ట్రలో 45 శాతం, జార్ఖండ్‌లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. అయితే కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ డిబేట్స్‌లో పాల్గొన కూడదని హస్తం పార్టీ నిర్ణయం తీసుకుంది. గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అప్పట్లో బీజేపీ విమర్శలు గుప్పించింది. ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమలనాథులు విమర్శలు గుప్పించారు.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం నుంచి పోలింగ్ నడుస్తోంది. ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఇక జార్ఖండ్‌లో అయితే రెండు విడతలగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత నవంబర్ 13న జరగగా.. రెండో విడత బుధవారం జరుగుతోంది. రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి విడతలో 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా 38 స్థానాలకు బుధవారం ఓటింగ్ జరుగుతోంది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీలు బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి భావిస్తోంది. బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలకానున్నాయి. ప్రజల నాడీ ఎలా ఉంటుందో దాదాపుగా ఒక పిక్చర్ వచ్చేస్తోంది.