Site icon NTV Telugu

BJP: అబద్ధాలతో సమాజంలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది.. కాంగ్రెస్‌పై ఈసీకి ఫిర్యాదు..

Bjp Vs Congress

Bjp Vs Congress

BJP: రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోందని బీజేపీ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్యాంగం మార్చేందుకు, రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 స్థానాలు కోరుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదు నమోదైంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మరియు పార్టీ నాయకుడు ఓం పాఠక్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌తో సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు డీఫ్ ఫేక్ వీడియోలను అప్‌లోడ్ చేసి షేర్ చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.

Read Also: NewsClick Case: న్యూస్‌క్లిక్ కేసులో సంచలన విషయాలు.. ఢిల్లీ అల్లర్లను ప్రోత్సహించడానికి చైనా నుంచి నిధులు..

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన నకిలీ వీడియో వైరల్ అయింది. ఇందులో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన ప్రకటించినట్లుగా మార్పింగ్ వీడియోను వైరల్ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ సహా 22 మందికి సమన్లు పంపింది.

వ్యక్తులు, విధానాలు, రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, సమాజంలో ఉద్రిక్తతలను పెంపొందించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నంలో, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు వ్యవస్థీకృత పద్ధతిలో దీనిని చేస్తున్నాయని బీజేపీ నేత త్రివేది ఆరోపించారు. వీటిపై ఈసీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బీజేపీ ఈ ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల ప్రసంగాలను ఈసీకి మెమొరాండంగా ఇచ్చింది.

Exit mobile version