NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం… ఒకరికి రెండు సార్లు మాత్రమే రాజ్యసభ సీటు..!

Chintan Shibir

Chintan Shibir

కాంగ్రెస్ తనను తాను నవీకరించుకోవాలనుకుంటోంది. ఇందుకు రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా జరుగుతున్న ‘నవ సంకల్ప్ శింతన్ శిబిర్’ వేదిక అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’ అనే పాలసీని తీసుకువచ్చింది. ఎంతటి పెద్ద నేతలైనా వారి కుటుంబాల వ్యక్తులకు టికెట్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. టికెట్ పొందాలంటే ఖచ్చితంగా పార్టీలో పనిచేసి ఉండాలనే నియమాలను తీసుకువచ్చింది. శింతన్ శిబిర్ తొలి రోజే సోనియాగాంధీ తన అధ్యక్ష ఉపన్యాసంలో కాంగ్రెస్ పార్టీ కొత్త రూపు సంతరించుకుంటుందని చెప్పకనే చెప్పారు. పార్టీ మీకు ఎంతో ఇచ్చింది… మీరు పార్టీకి ఇవ్వాల్సిన టైం వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ సీటుపై పరిమితిని విధించాలనే చర్చ జరుగుతోంది. ఒకరికి రెండుసార్లు మాత్రమే రాజ్యసభ సీటు కేటాయించాలనే దానిపై తీవ్రంగా చర్చిస్తున్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలం కొంతమంది మాత్రమే పదవుల్లో ఉండకుండా, అందరికి అవకాశం ఇవ్వడానికి రాజ్యసభ సీటును రెండుసార్ల కన్నా ఎక్కువ సార్లు కేటాయించకూడదనే పరిమితి విధిస్తారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రేపు ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముందుకు పలు తీర్మానాలు రానున్నాయి.  రెండో రోజు శింతన్ శిబిర్ లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇంచార్జులు, పీసీసీ సభ్యులు, సీఎల్పీ లీడర్లతో సమావేశం అయ్యారు.